తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
కాకినాడ సిటీ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు విమర్శించారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రథమ మహాసభ కాకినాడలోని ఎస్‌టీయూ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూషణం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రబాబు, లెనిన్‌బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ ప్రకటించి, నూతన విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరారు. అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ చేసి 26 జిల్లాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పట్టణ కార్యదర్శి అన్నవరం మాట్లాడుతూ, గ్రామ, వార్డు వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకుని, రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు రాజవర్ధన్, వై.బాబి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మందితో ఏఐవైఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలో పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు.
ఫ నిరుద్యోగ భృతి ఇవ్వాలి
ఫ ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment