రేపటి నుంచి భూముల విలువ పెంపు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి భూముల విలువ పెంపు

Published Fri, Jan 31 2025 2:07 AM | Last Updated on Fri, Jan 31 2025 2:07 AM

-

దండిగా రిజిస్ట్రేషన్లు..

దండుకున్న దళారీలు

తుని: ఆదాయం పెంచుకునే లక్ష్యంతో భూముల విలువను శనివారం నుంచి భారీగా పెంచాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దళారులు సొమ్ము చేసుకున్నారు. దొరికినకాడికి కక్షిదారులను దోచుకున్నారు. భూమి ధరలను 40 నుంచి 60 శాతం మేర ప్రభుత్వం పెంచింది. దీనివలన భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం రూ.10 లక్షలు ఉన్న భూమి ధర ఏకంగా రూ.14 లక్షలకు పెరుగుతుంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలతో పాటు స్టాంపు డ్యూటీ కూడా పెరిగి, కొనుగోలుదార్లపై మరింత భారం పడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం ఒక్కసారిగా భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రూ.కోట్లలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. తుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 65 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అటువంటిది గురువారం ఒక్క రోజే 110 జరిగాయి. వీటిలో లిటిగేషన్‌లో ఉన్నవి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదే అదనుగా ఇటు కొందరు ఉద్యోగులు, అటు దళారులు కూడా కక్షిదారుల నుంచి దండిగా దండుకున్నారు. అయితే, సర్వర్‌ డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్లలో జాప్యం జరిగిందని తుని సబ్‌ రిజిస్ట్రార్‌ సుబ్బారెడ్డి చెప్పారు.

పోస్టల్‌ సూపరింటెండెంట్‌పై

కేంద్ర మంత్రికి ఫిర్యాదు

జగ్గంపేట: మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్న జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ తనను వేధిస్తున్నారంటూ కాట్రావులపల్లి బ్రాంచి పోస్టు మాస్టర్‌ సీహెచ్‌ దేవి కేంద్ర సమాచార మంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె స్థానికంగా ఒక లేఖ విడుదల చేశారు. వివిధ పథకాలకు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ టార్గెట్లు విధిస్తూ సమయం లేకుండా వేధిస్తున్నారని, మూడు నెలలుగా జీతం కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. తరచూ అధికారులను పంపించి, తనిఖీల పేరుతో ఒత్తిళ్లు తెస్తున్నారని, తనిఖీకి వచ్చిన వారు కనీసం రిజిస్టర్‌లో సంతకాలు కూడా చేయకుండా వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. కాకినాడ వెళ్లి జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ను కలవాలంటూ కింది స్థాయి అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని దేవి ఆరోపించారు. విధి నిర్వహణలో 1999 నుంచి అధికారులు, గ్రామస్తుల మన్ననలు పొందానని, కానీ, ఇప్పడు జిల్లా అధికారి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, ఇంత ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను రాష్ట్ర పోస్టల్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేఖ ద్వారా వివరించానని, తగిన విచారణ జరిపి వారైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని దేవి తెలిపారు.

2న సీనియర్‌

వుమెన్‌ హాకీ ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): వచ్చే నెల 2న సీనియర్స్‌ వుమెన్‌ విభాగం హాకీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి నంబు శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఎంపికైన వారు వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకూ నెల్లూరులో జరిగే అంతర్‌ జిల్లాల వుమెన్‌ హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపికలు జిల్లా క్రీడా మైదానం హాకీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయని హాకీ కోచ్‌ వి.రవిరాజు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement