శిలాఫలకాలే సిగ్గుపడేలా.. | - | Sakshi
Sakshi News home page

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

Published Fri, Jan 31 2025 2:07 AM | Last Updated on Fri, Jan 31 2025 2:07 AM

శిలాఫ

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

తునిలో టీడీపీ ‘వంకర’స్థాపనలు

లోవ తలుపులమ్మ సాక్షిగా ప్రచార యావ

70 శాతం పూర్తయిన పునర్నిర్మాణ పనులు

ఎస్కలేటర్‌ పేరుతో మరోసారి శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుగా ఉంది కూటమి నేతల తీరు. శిలాఫలకాలే సిగ్గు పడేలా చేస్తున్న కార్యక్రమాలతో జనం విస్తుబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చేతులెత్తేశారు. ఆ పార్టీ నేతలు సైతం ఆయన బాటలోనే పయనిస్తున్నారు. గద్దెనెక్కి ఏడు నెలలవుతున్నా సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయలేక పాలనా వైఫల్యాలతో చంద్రబాబు కొట్టుమిట్టాడుతుంటే ఆయన వందిమాగధులు జరుగుతున్న పనులకే శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేసేస్తున్నారు. ఆవు చేలో మేస్తూంటే దూడ గట్టున మేస్తుందా అనే సామెతను తలపిస్తోంది కూటమి నేతల తీరు. టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు. ఆ పార్టీలో వైఆర్‌కేగా పిలుచుకునే ఆయన సొంత నియోజకవర్గం తుని. వరుస పరాజయాలతో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. రాజకీయ వారసురాలిగా కుమార్తె దివ్యను రంగంలోకి దింపారు. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన రామకృష్ణుడి పర్యవేక్షణలో దివ్య సారథ్యంలో తుని నియోజకవర్గంలో చేస్తున్న ఆర్భాటపు కార్యక్రమాలను చూసి జనం నివ్వెరపోతున్నారు.

సొమ్మొకడిది.. సోకొకడిది చందాన..

అటు ఉత్తరాంధ్ర, ఇటు గోదావరి జిల్లాల్లో భక్తుల ఇలవేల్పు లోవ తలుపులమ్మ తల్లి. ఆ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి గతంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలోనే భక్తులు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసుకున్నారు. అయినప్పటికీ నాడు ఆయన నుంచి వీసమెత్తు స్పందన కూడా కనిపించ లేదు. ఈ పరిస్థితుల్లో తలుపులమ్మ లోవ దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు కూడా అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఈ పనులను తామే చేయిస్తున్నామన్నట్లు.. సొమ్మొకడిది.. సోకొకడిది అనే రీతిలో.. తలుపులమ్మ తల్లి సాక్షిగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచార యావతో.. రెండు రోజుల క్రితం ఫొటోలకు పోజులిస్తూ శంకుస్థాపన చేయడం విమర్శల పాలైంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే శ్రీకారం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి తుని ఎమ్మెల్యే, అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా తలుపులమ్మ తల్లి భక్తుల మనోభావాలను నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఆలయ పునర్నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటి సీఎం జగన్‌ స్పందించి, సుమారు రూ.15 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్‌లో లోవ దేవస్థానం పునర్నిర్మాణ పనులకు అప్పటి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. 2023 జనవరిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనుల్లో భాగంగా అమ్మవారి బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ రాజగోపురంలో ఐదంతస్తులు నిర్మించాలనేది ప్రతిపాదన. రాజగోపురంలో నాలుగంతస్తుల పనులు అప్పట్లోనే దాదాపు పూర్తి కావచ్చాయి. ఐదో అంతస్తు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు ఎన్నో ఏళ్ల భక్తుల కల అయిన మహామండపం నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. పెయిటింగ్‌ పనులు చురుగ్గా చేపట్టారు. పనిలో పనిగా రాతిమెట్ల పనులు కూడా చేపట్టారు. గర్భాలయ నిర్మాణం పూర్తి చేశారు. అమ్మవారి దర్శనాలు కూడా ఎప్పటి మాదిరిగానే భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.

అన్నీ అయ్యాక.. ఆర్భాటం

అన్ని పనులూ పూర్తయ్యాక చివరిలో ఎస్కలేటర్‌ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులు మొదటి నుంచీ అనుకుంటున్నారు. దీంతో ఆ పనులు చివరి వరకూ చేపట్ట లేదు. దాదాపు 70 శాతం పనులు పూర్తి కాగా.. ఎస్కలేటర్‌తో పాటు కొన్ని సివిల్‌ వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో టీడీపీ నేతలు ఎస్కలేటర్‌ పనులకు శంకుస్థాపన పేరుతో ఆర్భాటం చేసి ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే నిస్సిగ్గుగా ప్రయత్నించడాన్ని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరితే పట్టించుకోని టీడీపీ పెద్దలు.. వైఎస్సార్‌ సీపీ హయాంలో నిధులు మంజూరై, జరుగుతున్న పనులకు మరోసారి శంకుస్థాపన చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అది కూడా ఎస్కలేటర్‌ పనులకు శంకుస్థాపన పేరిట ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. మొత్తం ఆలయ పునర్నిర్మాణానికి కేటాయించిన రూ.15 కోట్ల పనులకు నాడు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు ఎస్కలేటర్‌కు మరోసారి శంకుస్థాపన చేయడమేమిటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

శంకుస్థాపనలపై

శంకుస్థాపనలు విడ్డూరం

తలుపులమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం అనేది భక్తుల చిరకాల కోరిక. ఈ విషయాన్ని అప్పటి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, సుమారు రూ.15 కోట్లు మంజూరు చేయించాం. 2022లో శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మరో 30 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తవుతున్న సమయంలో టీడీపీ నేతలు కొత్తగా శంకుస్థాప న చేయడం ఆశ్చర్యం వేసింది. శంకుస్థాపనల పై శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉంది.

– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తుని

No comments yet. Be the first to comment!
Add a comment
శిలాఫలకాలే సిగ్గుపడేలా..1
1/5

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

శిలాఫలకాలే సిగ్గుపడేలా..2
2/5

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

శిలాఫలకాలే సిగ్గుపడేలా..3
3/5

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

శిలాఫలకాలే సిగ్గుపడేలా..4
4/5

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

శిలాఫలకాలే సిగ్గుపడేలా..5
5/5

శిలాఫలకాలే సిగ్గుపడేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement