ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) జె.వెంకటరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీసు, విద్యుత్, ఏపీఎస్ ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 5 నుంచి 19వ తేదీ వరకూ ప్రాక్టికల్స్, మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ థీయరీ పరీక్షలు జరగనున్నాయన్నారు. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు 89, పబ్లిక్ పరీక్షలకు 56 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖను ఆదేశించారు. ప్రశ్నపత్రాల తరలింపు, పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ఇన్విజిలేటర్ల నియామకంపై జిల్లా విద్యా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 22,660 మంది, రెండో సంవత్సరం 21,871 మంది చొప్పున విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
ముగ్గురు అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించామన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయని డీఆర్వో వెంకటరావు తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియెట్ అధికారి జీజీకే నూకరాజు, ఇంటర్ పబ్లిక్ పరీక్షల అధికారి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment