బీబీబీ రైల్వేలైనుకు మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

బీబీబీ రైల్వేలైనుకు మోక్షమెప్పుడో?

Published Fri, Jan 31 2025 2:04 AM | Last Updated on Fri, Jan 31 2025 2:04 AM

-

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈసారైనా జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారన్న ఆశతో జిల్లావాసులున్నారు. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన సికింద్రాబాద్‌ –కామారెడ్డి –నిజామాబాద్‌ –ముథ్కేడ్‌ రూట్‌లో డబ్లింగ్‌ పనులు అసంపూర్తిగా మిగిలాయి. సికింద్రాబాద్‌ నుంచి ముథ్కేడ్‌ దాకా రైల్వేలైన్‌ 249 కి.మీ. విస్తరించి ఉంది. రాష్ట్ర రాజధాని నుంచి దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయికి ఈ మార్గం దగ్గరగా ఉంటుంది. ఈ మార్గంలో రోజూ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. ఈ లైన్‌పై నిత్యం 60 వరకు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తిరుగుతుంటాయి. అలాగే రవాణా రైళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే నడుస్తుంటాయి. ఈ మార్గంలో బాసర సరస్వతి మాత ఆలయం, నాందేడ్‌ గురుద్వారా, షిరిడీ సాయిబాబా ఆలయాలున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రైళ్ల సంఖ్యను పెంచినా డబుల్‌ లైన్‌ లేకపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. డబ్లింగ్‌ పనుల పూర్తికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

కేకేవై రోడ్డుకు నిధులొచ్చేనా?

కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి మీదుగా ఎ ల్లారెడ్డి వరకు ఉన్న కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వలేదు. ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో నిత్యం ఎక్కడోచోట ప్రమాదం జరుగుతోంది. రోడ్డును విస్తరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడంతో పంట ఉత్పత్తులను నిల్వ చేయడం సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలతో పాటు భారీ గోదాంల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. ప్రత్యేక కోర్సులతో ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం విద్యారంగంలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.

రైల్వే వంతెనలు లేక ఇబ్బందులు

కామారెడ్డి పట్టణాన్ని రైల్వేలైన్‌ రెండుగా చీలుస్తుంది. పట్టణంలో రాకపోకల కోసం రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకు వంతెన ఒక్కటే ఉంది. అశోక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడంతో నిత్యం రైళ్లు వచ్చినప్పుడల్లా ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలకు వెళ్లేందుకు ఇదే ప్రధానదారి కావడంతో వందలాది వాహనాలు రైల్వే గేట్‌ మీదుగానే వెళ్తాయి. గంటకు మూడునాలుగుసార్లు రైల్వే గేటు పడుతుండడంతో ఈ మార్గంలో వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కసాబ్‌ గల్లీ ప్రాంతంలో మరో రైల్వే వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది.

వెనకబడిన ప్రాంతమైన బాన్సువాడ, జుక్కల్‌ ని యోజక వర్గాలకు రైల్వే సదుపాయం కల్పించేందు కు బోధన్‌ నుంచి బాన్సువాడ మీదుగా కర్ణాటక రా ష్ట్రంలోని బీదర్‌ దాకా రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. బోధన్‌ – బీదర్‌ మధ్య దూరం సుమారు 140 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లైన్‌ మంజూరు చేయిస్తామని ప్రతి ఎన్నికలలో నేతలు హామీ ఇస్తుంటారు. బడ్జెట్‌ సమయంలో నిధుల కోసం వినతులు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. రైల్వేలైన్‌ చేపట్టేందుకు గతంలో సర్వేలు చేసినా నిధులు రాకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా ఈ లైన్‌ ప్రస్తావన ఉంటుందేమోనని ప్రజలు ఆశతో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement