
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం(45) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. తొలుత రెక్కీ నిర్వహించిన ఇద్దరు దుండగులు.. కోరుట్ల నడిబొడ్డున ఉన్న క్రిస్టియన్ కాంపౌండ్ వద్దగల గుడిసె హోటల్ వద్ద ఉదయం నుంచే మాటువేశారు. ఎప్పటిలాగే టీ తాగేందుకు అక్కడకు చేరుకున్న లక్ష్మీరాజం.. హోటల్‌లో టీ తాగారు.
స్థానికులతో ముచ్చటిస్తున్నారు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఇద్దరు అగంతకులు.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చీరాగానే లక్ష్మీరాజం మెడపై కత్తితో మూడుసార్లు గట్టిగా పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. హఠాత్పరిణామానికి హోటల్‌లో ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు.
దుండగులు తాము వచ్చిన ద్విచక్రవాహనంపై పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుకుంటున్న లక్ష్మీరాజంను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం కోరుట్ల తొమ్మిదోవార్డు కౌన్సిలర్. వీరికి ఇద్దరు సంతానం. అధికార పార్టీ నాయకుడు కావడంతో కోరుట్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment