కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ సర్పంచు పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్‌పార్టీ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లోనే ఉండి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీనివాస్ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సర్పంచు శ్రీనివాస్‌పై గతంలో కరీంనగర్‌రూరల్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేసిన సర్క్యులర్‌తోపాటు పలుకేసుల వివరాలు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారమైనాయి.
ఈక్రమంలో శనివారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌పార్టీలో చేరారు. టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సర్పంచు శ్రీనివాస్ కలుసుకోవడం జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
కరీంనగర్ టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నాయకులు హైదరాబాద్ స్థాయిలో టీపీసీసీ నాయకులతో ప్రయత్నిస్తుండగా శ్రీనివాస్ ఏకంగా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన మరుసటిరోజే టికెట్ కోసం ఏఐసీసీ అధ్యక్షుడిని కలుసుకునే అవకాశం రావడం పార్టీలోని మిగతా ఆశావహులను కలవరపరుస్తోంది. ఎది ఏమైనా శ్రీనివాస్ ఢిల్లీలో రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment