సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చిచేరిన నేతలు లేదా పార్టీ మారకుండా అసంతృప్తిగా ఉన్న ఇంటిదొంగలు తమ వ్యూహాలు లీక్ చేస్తున్నారేమోనని పలువురు నేతలు సతమతమవుతున్నారు. సొంత శిబిరంలోని ఇలాంటి ‘కట్టప్పల’ను పట్టుకోవడం ఎట్లా అని? వారు తలలు పట్టుకుంటున్నారు.
► ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ ఒకరు పార్టీ మారుతున్నడనే సమాచారం కోవర్టుల ద్వారా తెలుసుకున్న సదరు నేత వెంటనే అప్రమత్తమై బుజ్జగించాడు.
► ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం కొంత డబ్బును రహస్యంగా కారులో హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గానికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. కోవర్టుతోనే సమాచారం లీకై నగదు పట్టుపడినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
► మరో నియోజకవర్గ నేత తన సెగ్మెంట్ పరిధిలో దసరా కానుకగా డీజే సౌండ్ బాక్స్‌లు పంచిపెట్టాలనుకున్నారు. అలాగే తన పేరుతో గోడ గడియారాలు పంచి పెట్టడానికి లారీలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. ప్రత్యర్థుల పార్టీల్లోకి కోవర్టులను పంపి వారి సమాచారం సేకరించే సదరు నేతకు ఈసారి కోవర్టులతో రివర్స్ షాక్‌లు కొడుతున్నాయి. దీంతో ఎవరిని నమ్మాల్నో.. ఎవరికి ఏం చెప్పాల్నో అర్థమైతలేదని వాపోతున్నాడు.
నేతలకు కోవర్టుల టెన్షన్..
► పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ కొలది నేతలకు కోవర్టుల టెన్షన్ పెరిగిపోతోంది.
► ఎన్నికల్లో విజయం సాధించాలంటే తాము ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నామనేది ఎంతముఖ్యమో.. ప్రతిపక్ష పార్టీ నేతలు వేసే ఎత్తుగడలను ముందే పసిగట్టడం అంతే ముఖ్యంగా భావిస్తున్న నేతలు.. కోవర్టు అస్త్రాలు సంధిస్తున్నారు.
► ప్రత్యర్థి పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కోవడంతోపాటు, తమ పార్టీలోని నేతలు ప్రత్యర్థి గూటికి చేరకుండా చూసుకోవడం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.
► దీంతో ప్రత్యర్థి పార్టీల్లో తమ అనుచరులను ఉంచేలా చూసుకుంటున్నారు.
► దానికోసం భారీగా ఆర్థిక సాయం అందించటంతోపాటు, ఎన్నికల అనంతరం పదవుల హామీతో ప్రత్యర్థి శిబిరంలోకి పంపుతున్నారు.
► ప్రజల నాడీ తెలియక తికమకపడుతున్నా నేతలకు, పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారు ఎవరో, కట్టప్పలు ఎవరో తెలియక ఆందోళన చెందుతున్నారు.
► ఫిరాయింపు నేతలతోపాటు సొంతపార్టీల్లోనే అసమ్మతి నేతలను సైతం అనుమానిస్తూ, ఎవరిని నమ్మాలో తెలియక టెన్షన్ పడుతున్నారు.
గతంలో చేదు అనుభవాలతో..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలానియోజకవర్గాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులే మళ్లీ ఎన్నికల బరిలో తలపడుతున్నారు. తాయిలాలు, డబ్బు, పార్టీలో చేరికలు తదితర అంశాలను కోవర్టులు లీక్ చేయటంతోనే గతంలో తీవ్రంగా నష్టపోయారు. ఈసారి ఎన్నికల్లో కీలకమైన ఆర్థిక వ్యవహారాలు, పార్టీ ఫండ్ తదితర వివరాలను పార్టీ నేతలకు కాకుండా తమ బంధువులు, కుటుంబ సభ్యులే చూసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఓటర్లకు ఇచ్చే నజరానాలు, ఫండింగ్ ఇస్తున్నదెవరు? అనే అంశాలను తమ అనుచరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. పార్టీ నేతలు, కీలక నేతలను కేవలం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు చేయడానికే పరిమితం చేస్తున్నారు. దీంతో కొందరు కార్యకర్తలు నొచ్చుకుంటున్నారు. అయినా, ఒక్కోసారి ఎంతజాగ్రత్త పడినా రాత్రి అనుకున్న విషయాలు తెల్లారేలోగా పక్క పార్టీలకు చేరుతున్నాయి. ఇలా లీకేజీలకు పాల్పడుతున్న కోవర్టులు అన్ని పార్టీలకు దడపుట్టిస్తూ తలనొప్పిగా మారుతున్నారు.
ఇవి కూడా చదవండి: 'కర్రుకాల్చి వాతపెట్టున్రి' : కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment