పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు | Sakshi
Sakshi News home page

పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు

Published Wed, May 8 2024 11:50 PM

-

కరీంనగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ముమ్మరవుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తుండడం, మండుతున్న ఎండలతో సతమతమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు.

ఎత్తులకు పై ఎత్తులు

అన్ని సామాజిక వర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. నియోజక వర్గాల వారీగా ఉన్న మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఏయే సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరా తీస్తున్నారు. గెలుపోటములను నిర్ధారించే పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 45 శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. అయితే ఇప్పటికే పలు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థ ఓటర్లపై దృష్టిసారిస్తున్నారు.

కులపెద్దలతో మంతనాలు

ప్రధాన పార్టీల అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాల పెద్దలు, అనుచరగణం సహాయంతో మంతనాలు చేస్తున్నారు. స్థానిక సమస్యలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్న రూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజిక వర్గాలు వ్యవహరిస్తున్నాయి. పెద్దలను ముందు వరుసలో నిలబెట్టి ప్రచారానికి వచ్చే అభ్యర్థులను అది చేయాలి.. ఇది చేయాలి..! తమ ఇబ్బందులను తొలగించే వారికే ఓటేస్తామంటూ తెగేసి చెబుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాలు అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి వర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు.

రెండువైపులా వారే..

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఓ అభ్యర్థి ప్రచారంలో కనిపిస్తున్న వ్యక్తులు చీకటి కాగానే మరో అభ్యర్థి శిబిరంలో చేరిపోతున్నారు. తమకే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కరుగా వెళ్లకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. మరికొందరు ఇప్పటికే ఫిరాయింపులకు పాల్పడి చేరిన పక్షం వైపు చక్రం తిప్పుతున్నారు.

ప్రధాన పార్టీల నజర్‌

కరీంనగర్‌ పార్లమెంట్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు పగటి వేళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లో రహస్య మంతనాలు కొనసాగిస్తున్నాయి. రోజురోజుకు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గెలుపోటములను నిర్దారించే మండలాలు, మేజర్‌ గ్రామపంచాయతీలపై దృష్టిసారించారు. సామాజిక వర్గాలు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు, రైతులు, వృద్ధుల ఓట్లు తమకు అనుకూలంగా పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

’సామాజిక వర్గాలవారీగా లెక్కలు

కులపెద్దలను సంప్రదిస్తున్న లీడర్లు

ముందస్తు హామీలు.. నజరానాలు

ఓటర్ల మద్దతుకు

ప్రధాన పార్టీల యత్నం

Advertisement
 
Advertisement