
శివాజీనగర: మా తప్పులను విశ్లేషించుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని ఆపద్ధర్మ సీఎం బసవరాజ బొమ్మై అన్నారు. శనివారం హావేరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాము అన్ని విధాలా ప్రయత్నాలు చేశామని, అయినా మెజారిటీ దక్కలేదని వాపోయారు. మా కార్యకర్తలు, నాయకులు, ప్రధానమంత్రితో పాటుగా శ్రమించి పని చేశారు, కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభిస్తోంది. మా తప్పులను విశ్లేషించి, దాని గురించి సమీక్ష జరుపుతామని చెప్పారు. జాతీయ పార్టీగా మా సమస్యలను సరిచేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు మళ్లీ సిద్ధమవుతామని చెప్పారు. పార్టీని పునః సంఘటితపరచి తాము మళ్లీ అఽధికారంలోకి వస్తామన్నారు.
ప్రజా తీర్పే అంతిమం: కుమార
శివాజీనగర: ప్రజా తీర్పును స్వాగతిస్తున్నట్లు జేడీఎస్ మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తెలిపారు. ఎన్నికల ఫలితాల గురించి ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని స్వాగతిస్తానని, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమం. ఓటమి, గెలుపును సరి సమానంగా స్వీకరిస్తాను. అయితే ఈ ఓటమి ఫైనల్ కాదు. నా పోరాటం ఆగదని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. తమ పార్టీకి ఓటువేసిన అందరికీ కృతజ్ఞతలన్నారు. నాకు, నా కుటుంబానికి గెలుపు ఓటములు కొత్త కాదని, ఇంతకు ముందు హెచ్.డీ.దేవేగౌడ, హెచ్.డీ.రేవణ్ణ, తాను ఓటమిపాలయ్యామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి శ్రమిస్తానని, రానున్న కొత్త ప్రభుత్వానికి మంచి జరగాలని తెలిపారు.
శివాజీనగరలో రిజ్వాన్ హర్షద్ భారీ విజయం
శివాజీనగర: రాజధానిలో కేంద్ర బిందువుగా ఉన్న శివాజీనగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రిజ్వాన్ హర్షద్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అధికార బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్.చంద్రుపై సుమారు 30 వేల మెజారిటీని సాధించారు. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత నియోజకవర్గంలో ఈ మూడున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమని, తన గెలుపునకు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అదే విధంగా తనపై విశ్వాసముంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లందరికి రుణపడి సదా మీ సేవలో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా రెండోసారి అధిక మెజారిటీతో గెలుపొందిన రిజ్వాన్ హర్షద్‌ను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
డీకే ఆనందభాష్పాలు
శివాజీనగర: విధానసభా ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చినందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్నీరు కార్చారు. శనివారం నగరంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నాయకులు సమైక్యంగా బీజేపీపై పోరాటం చేశారని, అందుకు గెలుపు లభించిందని చెప్పారు. సిద్దరామయ్యతో పాటుగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు. తాను ఢిల్లీలో తిహార్ జైలులో ఉన్న సమయంలో పార్టీ నాయకురాలు సోనియాగాంధీ జైలుకు వచ్చి ధైర్యం చెప్పారని తలుచుకుని కన్నీరు కార్చారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహకారం ఎన్నటికీ మరువమన్నారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచి: సిద్దు
మైసూరు: ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచి అని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల గురించి కాంట్రాక్టర్లు, రుప్సా సంస్థవారు ప్రధాని మోదీకి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. తినను, తిననివ్వనని చెప్పే ప్రధాని కర్ణాటక బీజేపీ సర్కారును పట్టించుకోలేదన్నారు. బీజెపి పతనానికి ఇది ఆరంభమని, లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment