మైసూరు: ఉప తహశీల్దార్ వేధింపులు తాళలేక విసిగిపోయి కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంజనగూడు తాలూకా హుల్లహళ్లిలో జరిగింది. పరమేశ్ (36) అనే కంప్యూటర్ ఆపరేటర్‌ను నిత్యం మానసికంగా ఉపతహశీల్దార్ శివకుమార్ వేధించేవాడు. ఆఫీసులో పురుగులమందు తాగి పడిపోయిన పరమేశ్‌ను ఇతర ఉద్యోగులు చూసి కేఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించాడు. శివకుమార్ వేధింపులే కారణమని డెత్‌నోట్‌లో రాశాడు. నంజనగూడు ఎమ్మెల్యే దర్శన్, జిల్లాధికారి డాక్టర్ రాజేంద్ర ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. శివకుమార్‌ను సస్పెండ్ చేశారు.
అగ్రి విద్యార్థులకు జాగృతి
గౌరిబిదనూరు: తాలూకా గదరె జిపి కెంకరె గ్రామంలో కృషి విశ్వవిద్యాలయం, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యార్థులకు జాగృతి కార్యక్రమం జరిగింది. పొలాల్లో, రైతులతో కలిసి ప్రత్యక్ష అనుభవాన్ని పొందడానికై గ్రామంలో కొన్నిరోజులుగా మకాం వేసి పొలం పనుల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులు పంటల విక్రయాల్లో మధ్యవర్తుల సమస్యలు తొలగాలి. విజ్ఞాన ఫలితాలు రైతులకందాలి, అప్పుడే రైతుల జీవితాలలో వెలుగు చూడవచ్చని అన్నారు. ఇప్పటి ఆధునిక ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు, తక్కువ వర్షాపాతంలోనే ఈ పంటల్ని పండించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గదరె జిపి అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ, జీకేవీకే ముఖ్యులు డా. వెంకటేశ్, హోసూరు మంజునాథ్, రైతులు పాల్గొన్నారు.
సౌందర్య పోటీల్లో ప్రతిభ
బనశంకరి: బెళగావి కి చెందిన నీతా సంతోష్‌ఽ శిరగాంవకర్ మిసెస్ ఏషియా సూపర్‌మోడల్ పురస్కారం దక్కించుకుంది. పెళ్లయ్యాక ఇంటికే పరిమితం కాకుండా అందాల పోటీల్లో సత్తా చాటుకుంది. డిసెంబరు 28 తేదీన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మిగతా పోటీదారులను కాదని టాప్‌లో నిలిచింది. ఆమె గతంలో మిసెస్ ఇండియా కర్ణాటక పోటీల్లో బెళగావి జిల్లా విన్నర్ సహా పలు టైటిళ్లను గెలుచుకుంది. ఆమె భర్త సంతోష్ బెళగావిలో రెవిన్యూ అధికారిగా పనిచేస్తున్నారు.
బస్సు పల్టీ, 50 మందికి గాయాలు
కృష్ణరాజపురం: చింతామణి–హోసకోటె రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని 50 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి చింతామణికి బయలుదేరిన ప్రైవేటు బస్సు అతి వేగం వల్ల అదుపుతప్పింది. బనహళ్లి గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్ పైనుంచి వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను హోసకోటెలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు.
బీఎంటీసీకి బస్సుకు
మరొకరు బలి
కృష్ణరాజపురం: బీఎంటీసీ బస్సులు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన తేజస్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరహళ్లి రోడ్డు మంత్రి ఆల్‌ఫైన్ అపార్టుమెంట్ ఎదుట జరిగింది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సుకు బైక్ తగులుకుని తేజస్ కిందపడిపోయాడు. ఈ సమయంలో యువకుడి మీద నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడి తేజస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment