
పరప్పన జైలుకు దర్శన్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె గత కొన్ని రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. శనివారంతో పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు దర్శన్‌ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో దర్శన్‌తో పాటు వినయ్, ప్రదోశ్, ధనరాజ్‌లను కూడా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకి తరలించారు. వారిని సుమారు 12 రోజుల పాటు ముమ్మరంగా విచారించి హత్య కేసులో పూర్తి సమాచారాన్ని సేకరించారు. అనేక వాహనాలు, వస్తు సామగ్రి, రూ. 30 లక్షల వరకూ నగదును సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. కాగా, దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు.
దర్శన్‌కు కోపం వస్తే విధ్వంసమే
దర్శన్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్‌లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు.
ఆ నలుగురిపై రమ్య ఫైర్
దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ, యడియూరప్పలపై నటి, కాంగ్రెస్ నాయకురాలైన రమ్య ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఘాటుగా స్పందిస్తూ పోస్టు చేసారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న, చట్టం అంటే గౌరవం లేని శక్తివంతులు, ధనవంతులు, ప్రభావిత వ్యక్తుల దుష్ట బుద్ధి, చెడు వ్యసనాలకు అమాయక మహిళలు, పిల్లలను బలి చేస్తున్నారు, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి ఘోర సత్యాలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియా, కేసులు నమోదు చేసి పనిచేస్తున్న పోలీసులకు అభినందనలు అన్నారు. ఇలాంటి కేసుల విచారణ త్వరగా తేల్చి నిందితులకు కఠిన శశిక్ష పడేలా చూడాలని కోరారు. పోస్టుతో పాటు దర్శన్, ప్రజ్వల్, యడియూరప్ప, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణల ఫోటోలను పోస్ట్ చేశారు.
ముగిసిన పోలీస్ రిమాండు

పరప్పన జైలుకు దర్శన్
Comments
Please login to add a commentAdd a comment