రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు

Published Thu, Mar 27 2025 12:43 AM | Last Updated on Thu, Mar 27 2025 12:41 AM

శివమొగ్గ: పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల పై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన రౌ డీషీటర్‌పై కాల్పులు జరిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జిల్లాలోని భద్రావతి నగరంలో జరిగింది. వివరాలు.. శివమొగ్గ తుంగానగర స్టేషన్‌ పరిధిలో ప్రముఖ రౌడీషీటర్‌గా ఉన్న కడేకల్‌ హబీద్‌ గత నెల భద్రావతి పేపర్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా, అతను భద్రావతిలోనే తలదాచుకున్నట్లు తెలిసింది. పేపర్‌ టౌన్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ నాగమ్మ తమ సిబ్బందితో వెళ్లగా, హబీద్‌ పోలీసులపైనే దాడి చేసి పారిపోవాలని చూశాడు. దీంతో సీఐ నాగమ్మ అతని కాళ్లపైకి కాల్పులు జరపడంతో అక్కడే పడిపోగా బంధించారు. నిందితున్ని, అతని దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హబీద్‌పై పలు పోలీసు స్టేషన్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు వంటి 20 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఘాట్‌ రోడ్డులో బస్సు– లారీ ఢీ

15 మందికి గాయాలు

శివమొగ్గ: కేఎస్‌ఆర్టీసీ బస్సు– ట్యాంకర్‌ లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకా మాస్తికట్టె వద్ద హులికల్‌ ఘాట్‌లో సోమవారం రాత్రి జరిగింది. బస్సు మంగళూరు నుంచి హొసపేట వైపు వెళుతోంది. ట్యాంకర్‌ లారీ ఎదురుగా వస్తోంది. ఈ సమయంలో ఢీ కొట్టుకున్నాయి. బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిమ్మచీకటిలో హాహాకారాలు చేశారు. వీరిని మెరుగైన చికిత్స కోసం శివమొగ్గ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఏడు మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నేత ఆర్‌ఎం మంజునాథ్‌గౌడ, స్నేహితులు చేరుకుని బాధితులను ఆస్పత్రిలో చేర్పించి భోజన వసతులను కల్పించారు.

మోపెడ్‌పై లారీ పల్టీ

వాహనదారు మృతి

తుమకూరు: లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి టీవీఎస్‌ మోపెడ్‌పై బోల్తా పడింది. మోపెడ్‌ వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ప్రజలు జాతీయ రహదారి మధ్యలో షామియానా వేసి ఆందోళన చేశారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు నాఫెడ్‌ కేంద్రం నుంచి రాగిధాన్యం లోడ్‌తో శిరా గోడోన్‌కు లారీ వెళుతోంది. యగచీహళ్లి వద్ద గాణదాళు సొసైటీ నుంచి టీవీఎస్‌లో వెళుతున్న అమీర్‌ (72) అనే వృద్ధుని మీద లారీ బోల్తా పడింది. అమీర్‌ అక్కడే మరణించాడు. లారీలోని రాగి మూటలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందని, ఇక్కడ వేగ నిరోధకాలను ఏర్పాటు చేయాలని ప్రజలు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. చివరకు పోలీసులు వచ్చి నచ్చజెప్పారు.

మైసూరు గొడవ..

ఎస్‌ఐ సస్పెండ్‌

మైసూరు: గతంలో నగరంలోని ఉదయగిరి పోలీసు స్టేషన్‌, సిబ్బందిపై ఓ వర్గం వారు దాడి చేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఒక ఎస్‌ఐ, ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు. సామాజిక మాధ్యమంలో ఒక వ్యక్తి చేసిన పోస్టు వల్ల అల్లరి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి అదే ఠాణాకు తీసుకురావడం తప్పిదమని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మరెక్కడికై నా తీసుకెళ్లి ఉండాల్సిందని, తద్వారా గొడవలు జరిగేవి కావని అంచనా వేశారు. పరిస్థితులను నియంత్రించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలపై ఠాణా ఎస్‌ఐ రూపేశ్‌, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్‌ సీమా లాట్కర్‌ సస్పెండ్‌ చేశారు.

రౌడీషీటర్‌పై  పోలీసుల కాల్పులు 1
1/2

రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు

రౌడీషీటర్‌పై  పోలీసుల కాల్పులు 2
2/2

రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement