
పశువుల స్నానం.. ముగ్గురికి మృత్యుపాశం
మైసూరు: ఉగాది పండుగ సందర్భంగా పశువులను కడగడానికి చెరువులోకి వెళ్ళిన ముగ్గురు అనుకోకుండా నీట మునిగి చనిపోయారు. జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కామనహళ్ళిలో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. వినోద్ (17), బసవేగౌడ (45), ముద్దేగౌడ (48)లు పండుగ కావడంతో తమ పశువులకు స్నానం చేయించి అలంకరించాలని చెరువుకు తీసుకెళ్లారు. ఓ ఎద్దు బెదిరి చెరువులోకి పరుగులు తీసింది. తాడు పట్టుకుని ఉన్న వినోద్‌ను కూడా లాక్కెళ్లింది. మిగతా ఇద్దరు అతన్ని కాపాడాలని వెళ్లారు. కానీ నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చెరువులో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం తాండవించింది.