కృష్ణరాజపురం: నగరంలో పాలికె చెత్త లారీలు తరచూ ప్రమాదాలకు కారణమవుతూ ప్రజలకు బెదురు పుట్టిస్తున్నాయి. బీబీఎంపీ చెత్త లారీ డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పడిన ఘటన బెంగళూరు పులకేశినగరలోని సింధి సర్కిల్ వద్ద జరిగింది. చెత్తను డంప్ యార్డుకు తరలిస్తుండగా లారీ డ్రైవర్ అతి వేగంగా మలుపు తిప్పడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు, జనం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. లారీ డ్రైవర్ చింగారికి చిన్న గాయాలయ్యాయి. పులకేశినగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీదర్ జిల్లాలో భూప్రకంపనలు
సాక్షి, బళ్లారి: బర్మా, థాయ్‌లాండ్ దేశాల్లో భయంకరమైన భూకంపం వచ్చి అంతటా భయాందోళన నెలకొన్న సమయంలో, విజయపుర జిల్లాలో భూమి కంపించింది. మంగళవారం జిల్లాలోని తిక్కోటా తాలూకా పరిధిలో పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఎవరికీ హాని కలగలేదు. ప్రకంపనల సమయంలో భూమి నుంచి పెద్దఎత్తున శబ్ధం రావడంతో ప్రజలు హడలిపోయారు. ఉత్తర కర్ణాటకలో తరచూ భూప్రకంపనలు వస్తున్నాయి. కలబురగి, బీదర్ జిల్లాల్లో స్వల్పస్థాయి భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
బనశంకరి: విధానసభలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని స్పీకర్ యుటీ ఖాదర్ కు మంగళవారం బీజేపీ నేత ఆర్.అశోక్ లేఖరాశారు. గత నెల 21 తేదీన శాసనసభలో హనీట్రాప్ గొడవ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ చర్చ సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నాకు దిగామని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అంతేగాక పలు ఆంక్షలు కూడా విధించారని తెలిపారు. స్పీకర్ పీఠానికి అగౌరవం తీసుకువచ్చే ఉద్దేశం ఎమ్మెల్యేలకు లేదని చెప్పారు. పునఃపరిశీలించి సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరారు.
ఖైదీల వద్ద మొబైల్‌ఫోన్
మైసూరు: నగరంలోని సెంట్రల్ జైలులో ఖైదీలు యథేచ్ఛగా మొబైల్‌ఫోను వాడుతున్న వైనం బయటపడింది. నేరాల్లో నిందితులుగా జైలుకు వచ్చిన శివమొగ్గకు చెందిన కార్తీక్, నితిన్‌లు చాటుగా మొబైళ్లు ఉపయోగిస్తున్నారు. జైలు అధికారి ఎం.దీపా ఖైదీల గదులను తనిఖీ చేస్తుండగా, 25వ గదిలో నితిన్, కార్తీక్‌ల వద్ద ఒక స్మార్ట్‌ఫోన్, సిమ్ కార్డు లభించాయి. స్థానిక మండి పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టారు. కాగా, జైలులోపలికి నిషిద్ధ వస్తువులు దొంగచాటుగా చేరిపోతుంటాయి. నిందితులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు కావడమే కారణమని ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్‌పై యడ్డి ధ్వజం
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తుందని, అందులో తాను కూడా పాల్గొంటానని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తెలిపారు. మంగళవారం డాలర్స్ కాలనీ నివాసంలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతిపై పెనుభారం పడిందన్నారు. ఫ్రీడం పార్కులో ధర్నా చేస్తామని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సీఎం కుర్చీకోసం కాంగ్రెస్‌లో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది వారికి ముఖ్యమని, ప్రజలు కాదని హేళన చేశారు. ధర్నాలలో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారన్నారు.
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
కృష్ణరాజపురం: బెంగళూరులోని విజయనగర రైల్వే పైప్‌లైన్ రోడ్డు ఆర్‌పీసీ లేఔట్‌లో ఓ వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మరణించింది. సిద్దమ్మ (78) మృతురాలు. ఆమె సొంత ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది. మంగళవారం ఉదయం ఇంట్లోనే శవమై తేలింది. బంగారు చెవి కమ్మలు మాయమయ్యాయి. ఆమె మరణానంతరం ఎవరైనా వాటిని తీసుకెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్య జరిగినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు పోలీసులకు లభించలేదు. చెవికమ్మలు పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బీబీఎంపీ చెత్త లారీ బోల్తా