
ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు
సాక్షి,బళ్లారి: అఖిల ప్రపంచానికి ఆరాధ్యుడైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఊరులోనూ రామాలయం అందంగా సింగారించుకుంది. ఆలయాలను మామిడి తోరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయాల్లో కల్యాణవేదికలు ఏర్పాటు చేసి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఆలయం శ్రీరామనామంతో మార్మోగింది. సీతారాములను అలంకరించి వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించగా భక్తులు భక్తితో వీక్షించి తరించారు. శ్రీసీతారామ ఆలయాలతో పాటు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, భజనలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. బళ్లారిలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని శ్రీరామ దేవాలయం, మోతీ సర్కిల్ వద్ద ఉన్న సీతారామ ఆలయం, సత్యనారాయణపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మిల్లార్‌పేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర్ నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శివాలయాల్లో, అనంతపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ సీతారామ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తర, మహాపూజ, మంగళహారతులు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయాల్లో అన్నప్రసాదాలు, బెల్లంతో తయారు చేసిన పానకాలు, పెసరబేడలు అందజేశారు.
అంధ్రాలులో శ్రీరామ రథోత్సవం
బళ్లారి నగర శివార్లలోని ఆంధ్రాలలో వెలసిన శ్రీ రామ దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కల్యాణం నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు అందజేశారు.సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలనుంచి భక్తులు తరలిరావడంతో ఆంధ్రాలు పరిసరాలు జనంతో నిండిపోయాయి. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్ వెంకటరెడ్డి, కార్పొరేటర్ ఎం.రామాంజినేయులు, ఆలయ కమిటీ సభ్యులు జయరాములు, రేణమ్మసీతమ్మ, వెంకటేశులు, శరణయ్య, ప్రభయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలోని రైల్వే స్టేషన్‌లో రామాలయం, కోటలోని బాలాంజనేయ, పాతాళాంజనేయ, బెట్టద్ రామాలయం,మంగళవార పేట మారుతీ ఆలయాల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి అభిషేకాలు, అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య గీతా మందిర్, రామాలయంలో పూజలు చేపట్టారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాయచూరు రూరల్‌లో పంచముఖి ఆంజనేయ స్వామి, ప్రాణ దేవర ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బసనగౌడ, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం
ఆలయాల్లో మార్మోగిన
సీతారామ నామస్మరణ

ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు

ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు

ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు

ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు

ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు