
పోలీసులతో సమాజంలో శాంతిభద్రతలు
హొసపేటె: సమాజంలో శాంతి భద్రతలు నెలకొన్నాయంటే అది పోలీసుల వల్లే సాధ్యమని, ఇది పోలీసుల సేవ, ధైర్యం, అంకితభావానికి ప్రతీక అని విజయనగర జిల్లా ఎస్పీ బీఎల్ శ్రీహరిబాబు పేర్కొన్నారు. ఆయన నగరంలోని జిల్లా సాయుధ పోలీసు మైదానంలో పోలీసు జెండా దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పోలీసు జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. పోలీసు జెండా పంపిణీ అనేక సంవత్సరాలుగా శాఖలో సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవ, త్యాగాలను గుర్తు చేస్తుందన్నారు. 1984కి ముందు నవంబర్ 2వ తేదీని పోలీసు సంక్షేమ దినోత్సవంగా, ఏప్రిల్ 2వ తేదీని పోలీసు జెండా దినోత్సవంగా జరుపుకునేవారన్నారు. 1984 నుంచి ఈ జెండా దినోత్సవం, సంక్షేమ దినోత్సవాన్ని కలిపి ఏప్రిల్ 2న కర్ణాటక రాష్ట్ర పోలీసు జెండా, పోలీసు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2024–25వ సంవత్సరానికి పోలీసు సంక్షేమ నిధి నుంచి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆర్థిక సహాయంగా మొత్తం రూ.5,56,200 అందించామన్నారు. ఇందులో పోలీసు పిల్లల విద్య కోసం రూ.3,48,000, వారి కుటుంబాలకు కళ్లజోళ్ల కొనుగోలు కోసం రూ.33,200, మరణానంతర సహాయంగా రూ.45 వేలు, వివిధ హోదాల్లో పదవీ విరమణ చేసిన 26 మంది పోలీసు అధికారులకు సన్మానం కోసం రూ.1.30 లక్షలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్య భాగ్య కింద చికిత్స పొందారని తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు వెల్లడి