
సీఎం ఇంటి ముట్టడి భగ్నం
శివాజీనగర: నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేసిన బీజేపీ నాయకులు గురువారం సీఎం సిద్దరామయ్య అధికార నివాసం కావేరికి ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోగా గందరగోళం చెలరేగింది. మధ్యాహ్నం ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కావేరి ఇంటికి బయల్దేరారు. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తోసి ముఖ్యమంత్రి ఇంటి వైపు వెళ్లబోయారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు.
గుణపాఠం తప్పదు
అంతకుముందు విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ అహోరాత్రి ధర్నా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు. ఈ ప్రభుత్వానికి పేదలపై శ్రద్ధ లేదని, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్, బస్సు, డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు. 40 శాతం కమీషన్ల గురించి కాంగ్రెస్ చేసిన ప్రచారానికి సాక్ష్యాలు లేవని రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని పలువురు నాయకులు ఆస్తులను కబ్జా చేశారని, అందుకే వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాగా పోలీసులు సీనియర్ నాయకులను వాహనాల్లో తరలించి తరువాత విడుదల చేశారు.
బీజేపీ నేతల ప్రయత్నం
అడ్డుకున్న పోలీసులు