
కారు, బస్సు ఢీ.. నలుగురు బలి
మండ్య: బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళుతున్న కుటుంబం కూడా విషాదంలో చిక్కుకుంది. కారును బస్సు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మృతులు రెండు జంటలు. ఈ సంఘటన గురువారం బెంగళూరు– మైసూరు ఎక్స్‌ప్రెస్ హై వేలో మండ్య తాలూకాలోని తూబినకెరె వద్ద చోటు చేసుకుంది. మృతులు బెంగళూరులోని జేపీ నగరకు చెందిన బెస్కాం జూనియర్ ఇంజినీర్ సత్యానందరాజే అరస్ (51), భార్య నిశ్చిత (45), రిటైర్డు ఇంజినీర్ చంద్రరాజె అరసు (62) ఇతని భార్య సువేదిని రాణి (50).
సర్వీసు రోడ్డు మలుపులో...
సత్యానంద రాజె అరసు మేనమామ పిరియా పట్టణంలో చనిపోయాడు, కడసారి చూసి రావాలని కారులో బయలుదేరారు. చంద్రరాజే అరసు కూడా వారికి సమీప బంధువు అవుతారు. చంద్రరాజె అరసు కారు నడుపుతున్నారు. ఘటనాస్థలి వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న ఆర్టీసీ ఐరావత బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. నలుగురూ కారులో తీవ్రగాయాలతో చిక్కుకున్నారు. క్షణాల్లోనే ముగ్గురు చనిపోగా, స్థానికులు నిశ్చితను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున వచ్చి పరిశీలించారు. కారు బస్సులోకి ఇరుక్కుపోవడంతో క్రేన్‌తో లాగి బయటకు తీశారు. మృతదేహాలను మండ్య మిమ్స్ మార్చురీకి తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
మండ్య వద్ద ఎక్స్‌ప్రెస్ వేలో దుర్ఘటన
మృతులు బెస్కాం ఇంజినీరు,
మాజీ ఇంజినీరు దంపతులు
అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం