
రాజధానిని ముంచెత్తిన భారీ వాన
బనశంకరి: రాజధాని బెంగళూరును వేసవి వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం రాకతో వేసవి వేడి కాస్త తగ్గి వాతావరణం చల్లబడింది. గత రెండురోజులుగా నగరంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం పడలేదు. గురువారం ఉదయం నుంచి మేఘావృతమైంది, మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం ఆరంభమైంది.
ఈ ప్రాంతాలలో అధికం
హెబ్బాళ, ఆర్‌టీ.నగర, యలహంక, సదాశివనగర, శివానంద సర్కిల్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగర కేంద్రభాగాలైన మెజస్టిక్, ఎంజీ.రోడ్డు, కబ్బన్‌పార్కు, బసవనగుడి, శ్రీనగర, మైసూరురోడ్డు, బనశంకరి, జేపీ.నగర, పుట్టేనహళ్లి, హలసూరు. హెచ్‌ఏఎల్ విమానాశ్రయం, యశవంతపుర, పీణ్యా, తుమకూరు రోడ్డు, విజయనగర, రాజాజీనగర తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వాహనాలపై కూలిన చెట్టు
రాజాజీనగరలో గాలీ వానకు పెద్ద చెట్టు కూలి స్కార్పియో, స్విఫ్ట్ కారుతో పాటు పక్కన నిలిపిన బైక్‌లపై పడడంతో దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాలికె, కేఈబీ సిబ్బంది చేరుకుని చెట్టును తొలగించారు. ఈజీపుర మెయిన్‌రోడ్డులో కట్టడంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీరు చేరింది. లోపల ఉన్న కార్లు, బైకులు పాక్షికంగా మునిగిపోయాయి. బీటీఎం లేఔట్‌లో రోడ్లు జలమయం అయ్యాయి. లులు మాల్ ఎదురుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బెంగళూరు నుంచి తుమకూరుకు వెళుతున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్‌కు యాక్సిల్ కట్ కావడంతో వర్షంలో రోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు, స్థానికులు బస్‌ను ముందుకు తోసి రోడ్డు పక్కకు చేర్చారు. వర్షంలో వాహనదారులు, ప్రయాణికులు సతమతమయ్యారు.
ఎండల నుంచి ఉపశమనం
రాష్ట్రంలో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిన తరుణంలో నైరుతి రుతుపవన వర్షాలకు ముందే బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలలో వానలు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కరావళి, దక్షిణ ఒళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, మైసూరు, బెంగళూరు, హాసన, కొడగు, చామరాజనగర తో పాటు అనేకచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది.
హంపీలో విజయ విఠల ఆలయం సౌందర్యం
రాతి రథం, ఇతర స్మారకాల ప్రతిబింబాలు
వర్షంలో హంపీ అందం
రాయల రాజధాని హంపీలో జోరువాన కురిసింది. చారిత్రక శిల్ప కళా కట్టడాలు వాననీటిలో సుందర ప్రతిబింబాలయ్యాయి. పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కోలారు, బెళగావి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసి ఎండ నుంచి ఉపశమనం ఇచ్చింది.
ఆకస్మిక వర్షంతో రోడ్లు జలమయం
పలుచోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తం
ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం

రాజధానిని ముంచెత్తిన భారీ వాన

రాజధానిని ముంచెత్తిన భారీ వాన