
ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రశాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21 తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ముగిశాయి. పరీక్షలు ముగిశాయని విద్యార్థులు ఆనందంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. అయితే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష చివరి రోజున హావేరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అశ్రునయనాల మధ్య పరీక్ష రాశారు. హావేరి జిల్లా పద్మావతిపుర తాండాకు చెందిన రక్షిత, ధనరాజ్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాయడం కలిచివేసింది. వారి తండ్రి హనుమంతప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించగా 10 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి మరణవార్త నడుమ పరీక్షకు వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం నూరిపోసి నచ్చచెప్పి పరీక్షకు పంపించారు. తమను పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి, పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారని, ఉన్నఫళంగా గుండెపోటుతో మృతి చెందారని ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.
తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్నా చెల్లెళ్లు