
చంద్రమౌళేశ్వరుని సన్నిధిలో నటి సారా అలీఖాన్
హుబ్లీ: వాణిజ్య నగరి హుబ్లీ కేవలం వ్యాపార వ్యవహారాలతో చోటా ముంబైగా పేరు గడించింది. అయితే కళ్యాణ చాళుక్యులు నిర్మించిన అమర శిల్ప కళలకు ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో హుబ్లీలోని ఉణకల్ సుప్రసిద్ధ ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ప్రముఖ ఆలయానికి బాలీవుడ్ నటి సారా అలీఖాన్ దర్శించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆలయానికి వచ్చిన సదరు ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీ స్క్రీన్ షాట్‌ను హుబ్లీ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. నటి సారా అలీఖాన్ చంద్రమౌళేశ్వర ఆలయాన్ని దర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకుంటున్న నేపథ్యంలో మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ఘన చరిత్రను చాటడమే కాకుండా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా ఎమ్మెల్యే షేర్ చేసిన ఫోటోకు స్థానికులు ప్రసంశలు వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు వచ్చి వెళ్లారో మాత్రం వివరాలు మాత్రం తెలియరాలేదు. సారా అలీఖాన్ దేశ వ్యాప్తంగా ఆలయాలకు వెళతారు. మేకప్ లేకుండా నిరాడంబరంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. కేదార్‌నాథ్‌కు వెళ్లినప్పుడు శివుడి ఆశశీర్వాదం పొందుతూ ఆలయం మెట్లపై కూర్చొని ఉన్న ఫోటోను గతంలో పోస్టు చేశారు. ఆమె తొలి సినిమా కేదార్‌నాథ్ దర్శనం అనంతరం పుణ్యక్షేత్రాల్లో పర్యటించడం ఆమె అలవాటుగా పెట్టుకొని సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హర్షణీయమని స్థానికులు అభిప్రాయ పడ్డారు.