
వేతనాలు చెల్లించాలని వినతి
రాయచూరు రూరల్: జెస్కాంలోని 33 కె.వి.విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని జెస్కాం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం రాయచూరు జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణ బసవ మాట్లాడారు. జిల్లాలో గత 20 ఏళ్ల నుంచి జెస్కాంలోని 33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 500 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు లేక వెట్టి చాకిరీ చేస్తున్నారని, వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జెస్కాం అధికారికి వినతిపత్రం సమర్పించారు.
పాస్టర్ మృతిపై
సమగ్ర దర్యాప్తు జరిపించండి
బళ్లారిటౌన్: ఆంధ్రప్రదేశ్‌లో గతనెల 24న కోవూరు టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని బళ్లారి కర్ణాటక క్రిస్టియన్ వెల్ఫేర్ సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రముఖులు కే.ఫృద్వీరాజ్ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ పాస్టర్ హత్య అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. ఇది ముందస్తు పథకంతోనే హత్య చేసినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై ఆంధ్రప్రభుత్వం సమగ్ర తనిఖీ నిర్వహించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు విజయ్‌కుమార్, పాస్టర్లు విశ్వనాథ్, సర్జన్ సారథి, నీలప్ప స్వామి, సురేష్, కమలమ్మ, రాజు, ఐవన్ పింటో, రాజన్న, గొండయ్య, కృష్ణ, నాసిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్లు మంజూరు చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పడం మాని సిరవారకు అన్ని వర్గాలకు చెందిన హాస్టళ్లను మంజూరు చేయాలని దళిత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శుక్రవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బాలస్వామి మాట్లాడారు. సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు రాకపోవడం విచారకరమన్నారు. అధిక శాతం గ్రామీణ విద్యార్థులు ఉన్నందున విద్యా రంగం అభివృద్ధికి సిరవారలో వెనుక బడిన వర్గాల, సాంఘీక సంక్షేమ, మైనార్టీ, అంబేడ్కర్, మొరార్జి, రాణి కిత్తూరు చెన్నమ్మ, కస్తూరిబా గురుకుల హాస్టళ్లను ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
మొబైల్ లొకేషన్‌పై ఫిర్యాదు
● చాలా రోజుల నుంచి నాపై నిఘా వేశారు
● పోలీస్ అధికారులపై చర్యకు నగర
ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ డిమాండ్
రాయచూరు రూరల్ : ఓ ప్రజాప్రతినిధి వాడే మొబైల్ ఫోన్ లొకేషన్‌ను కబళిస్తున్నట్లు నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు ఆయన ఫిర్యాదు చేశారు. తన మొబైల్ ఫోన్ లొకేషన్‌కు సంబంధించి ప్రతి నెల 70 సార్లు జాబితాను తీస్తున్నారని, ఈ విషయంలో పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ అధికారులే ఈ కుట్రలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కేసులో వీరేష్ ప్రాణాలు కోల్పోయిన అంశంపై చర్చిస్తుండగా తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. శాసన సభ్యుడు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడారు అనే అంశాలను గమనిస్తున్నట్లు తెలిపారు.
కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు
కోలారు : తాలూకాలోని అరాభికొత్తనూరు గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ముగ్గురు గాయపడ్డారు. కోలారు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు అతి వేగంగా మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతల రోడ్డుపై వస్తున్న బైక్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న చుంచదేనహళ్లి గ్రామానికి చెందిన నాగేంద్రబాబు, నాగమణి, లలిత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో క్షతగాత్రులు ప్రమాద స్థలంలోనే నరకయాతనకు గురయ్యారు. కోలారు రూరల్ సీఐ కాంతరాజు, ఎస్‌ఐ వీ భారతి వచ్చి క్షతగ్రాత్రులను కోలారులోని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు.

వేతనాలు చెల్లించాలని వినతి

వేతనాలు చెల్లించాలని వినతి

వేతనాలు చెల్లించాలని వినతి