
నివేదికలోని కొన్ని అంశాలు..
సాక్షి, బెంగళూరు: ప్రతి గర్భిణి పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని కలలు కంటుంది. కానీ ఆస్పత్రుల్లో వివిధ కారణాల వల్ల వారి కలలు ఛిద్రమయ్యాయి. తల్లీ బిడ్డల అనుబంధం శాశ్వతంగా ఆవిరైంది. కన్నడనాడును ఎక్కువగా వేధిస్తున్న సమస్యల్లో గర్భిణులు, బాలింతల మరణం ఒక్కటి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా ఎక్కువసంఖ్యలో మరణించడం కలలకం రేపింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో రాష్ట్రంలో మొత్తం 464 మంది మహిళలు ప్రసవానికి ముందు, లేదా ప్రసవానంతరం మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 70 శాతం మరణాలను ఆపగలిగేవి అని ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక వెల్లడించింది. దీంతో వైద్యశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఈ ఏడాది మరణాలను కలిపితే 550 దాటుతుందని అంచనా.
గత నవంబర్‌లో బళ్లారి నుంచి..
గత ఏడాది నవంబర్‌లో బళ్లారి జిల్లా ఆస్పత్రిలో 5 మంది బాలింతలు వరుసగా చనిపోయారు. 9 నుంచి 11 తేదీల మధ్య జరిగిన సిజేరియన్ శస్త్రచికిత్సల తరువాత అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలతో మరణించారు. తరువాత ఉత్తర కర్ణాటక జిల్లాల వ్యాప్తంగా మృత్యుకేకలు అధికమయ్యాయి. దీంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ మరణాలపై పూర్తి స్థాయి తనిఖీ జరగాలని అందుకోసం ప్రభుత్వం ఒక విస్తృత రాష్ట్ర స్థాయి తనిఖీ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు వాణివిలాస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవితా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది.
ఆరోగ్య మంత్రి ఏమన్నారు
కమిటీ విచారణ జరిపి ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు స్పందించారు. ఈ మరణాలకు కేవలం రింగర్ లాక్టేట్ (ఆర్‌ఎల్) ద్రావణం మాత్రమే ఒక్కటే కారణం కాదని, మరిన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు.
పనిభారం ఎక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రులకు ఒత్తిడి తక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిని బదిలీ చేస్తామన్నారు. మొత్తానికి ప్రతి తాలూకా ఆస్పత్రికి ఇద్దరు నిపుణులైన వైద్యులు, ఒక పీడియాట్రీషియన్, ఒక అనస్థీసియా నిపుణుడు ఉండేలా చూస్తామన్నారు. మధ్యంతర నివేదికలోని కొన్ని సిఫారసులు ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు.
70 శాతం బాలింతల మరణాలను
అరికట్టి ఉండవచ్చు
సర్కారీ ఆస్పత్రుల్లో వసతుల లేమి
బాలింతల మరణాలపై కమిటీ
మధ్యంతర నివేదిక
గత ఏడాది కుదిపేసిన మృత్యుహేల
70 శాతం గర్భిణులు, బాలింతల మరణాలను తప్పించవచ్చు
గ్లూకోజ్‌గా ఎక్కించే రింగర్ లాక్టేట్ ద్రావణంలో సమస్యల వల్ల 18 మంది మరణించారు. బళ్లారి 5, రాయచూరులో నలుగురు, బెంగళూరులో ముగ్గురు, ఉత్తర కన్నడ, యాదగిరి, బెళగావిల్లో చెరో ఒకరు చనిపోయారు.
మరో పది కేసుల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం.
మరణాల్లో 50 శాతం కేసుల్లో తల్లులు 19 నుంచి 25 ఏళ్ల లోపువారు.
68 శాతం మరణాలు అధిక బీపీ, హృద్రోగం, మధుమేహం వల్ల జరిగాయి.
భవిష్యత్తులో తల్లుల మరణాలు తప్పించేందుకు 27 సిఫారసులు చేశారు. ముఖ్యంగా ఆయా ఆస్పత్రుల్లో మౌలికవసతుల పెంపు, ఉపకరణాలు, మందులు, రక్తనిధి వంటి సౌకర్యాలు ఉండాలని కమిటీ సూచించింది.
సాధారణ ప్రసవం అయిన వారికి మూడు రోజులు, సిజేరియస్ ప్రసవం అయిన వారు ఏడు రోజులు ఆస్పత్రిలోనే ఉండేలా తప్పనిసరి చేయాలి.
మరణానికి స్పష్టమైన కారణాలు లేని సందర్భాల్లో పోస్టుమార్టమ్ తప్పనిసరి చేయాలి.

నివేదికలోని కొన్ని అంశాలు..