సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ప్రధాన రహదారుల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం, విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం, నూతన హైవేల నిర్మాణం, పాత బైపాస్ మరమ్మతులను ఇందులో ప్రస్తావించారు. హైవేల నిర్మాణంతో పక్క రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడడడమే కాక దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. తద్వారా భక్తులు, పర్యాటకుల రాకపోకలు పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే, జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్‌కు కూడా మంత్రి ఈ లేఖ పంపించారు.
లేఖలో ప్రస్తావించిన ప్రధాన వివరాలు
●ఖమ్మం నాయుడుపేట జంక్షన్ నుండి మున్నేరు బ్రిడ్జి వరకు, ఖమ్మం – అశ్వారావుపేట మార్గంలోని కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేటలో నాలుగు లేన్ల రహదారి, సైడ్ డ్రెయినేజీలు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలి.
●వైరా వద్ద కట్టలేరు వాగుపై, సత్తుపల్లి వద్ద తమ్మిలేరు వాగుపై బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలి.
●365ఏ జాతీయ రహదారిని కోదాడ – ఖమ్మం మధ్య నిర్మించగా గతంలో నిర్మించిన రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే కోదాడ వెంకటగిరి నుంచి వెంకటాపురం వరకు రోడ్డును విస్తరించాలి.
●సారపాక – ఏటూరునాగారం వరకు నూతన జాతీయ రహదారిని మంజూరు చేయాలి. తద్వారా అశ్వాపురం, మణుగూరు వద్ద పారిశ్రామిక అభివృద్ధి, భద్రాచలం, మేడారం భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
●జగ్గయ్యపేట–కొత్తగూడెం వరకు బోనకల్, వైరా, తల్లాడ మీదుగా కొత్త హైవే మంజూరు చేయాలి.
●సారపాక నుండి రేచర్ల (ఆంధ్రప్రదేశ్)కు వయా బూర్గంపాడు, వెంకటాపురం, ముల్కలపల్లి, దమ్మపేట, మందలపల్లి, అల్లిపల్లి వరకు రహదారిని హైవేగా ప్రకటించి అభివృద్ధి చేయాలి.
కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి తుమ్మల లేఖ
Comments
Please login to add a commentAdd a comment