● ఇప్పటికే రైతుభరోసా, ఆత్మీయ భరోసా నగదు జమ ● రేషన్‌కార్డుల మంజూరు, చేతికి ఇళ్ల ప్రొసీడింగ్స్.. ● హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీన
ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాల ద్వారా మొదటి విడతలో జిల్లాలోని 6,361 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇరవై మండలాల్లో 206గామాల్లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో 15,856 మంది ఉన్నారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఎంపిక చేసిన గ్రామాల్లో..
నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభానికి అధికారులు జిల్లాలోని 20 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం రోజున లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. దీంతో మొత్తం 6,361 కుటుంబాలకు సంబంధించి 15,856 మందికి లబ్ధి కలిగింది. ఇందులో 12,649 మంది ఖాతాల్లో రైతుభరోసా, 840 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు జమ అయింది. అలాగే, 959 మంది కొత్తగా తెల్ల రేషన్‌కార్డులు అందుకోగా, 1,408 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిధులు జమ కానున్నాయి.
ఆ గ్రామాల్లో అత్యధికం
మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఐదేసి గ్రామాలు, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో నాలుగు, ఖమ్మం నియోజకవర్గంలో ఒక గ్రామంతో పాటు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కామేపల్లి మండలం పొన్నెకల్ల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మంరూరల్ మండలం ఆరెంపులలో 782 మందికి లబ్ధి జరిగింది. కొణిజర్ల మండలం చినగోపతిలో 695 మందికి, సత్తుపల్లి మండలం కొత్తూరులో 510మందికి పథకాలు అందాయి.
12,649 మందికి రైతుభరోసా
జిల్లాలోని 12,649 మంది అన్నదాతల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ అయింది. ఇందులో అత్యధికంగా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో 2,532 మందికి నగదు అందింది. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో 2,188 మందికి, వేంసూరు మండలం చిన్నమల్లెలలో 1,165 మందికి రైతుభరోసా జమ అయింది. అతి తక్కువగా కల్లూరు మండలం తూర్పులోకవరం గ్రామంలో 85 మంది ఖాతాల్లో రైతుభరోసా నగదు అయిందని అధికారులు వెల్లడించారు. ఇక సత్తుపల్లి మండలం కల్లూరులో 135 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కామేపల్లి మండలం పొన్నెకల్‌లో 127 మందికి, ఏన్కూరు మండలం రేపల్లెవాడలో 122మంది దక్కగా.. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో 114 మందికి రేషన్‌కార్డులు అందాయి. అలాగే, ఖమ్మంరూరల్ మండలం ఆరెంపులలో 135 మంది ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు జమ అయింది.
Comments
Please login to add a commentAdd a comment