రోడ్డుప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● అదనపు కలెక్టర్ శ్రీజ ● రవాణా శాఖ ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ
ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయనే విషయాన్ని అందరూ గుర్తించి ప్రమాదాల నివారణను బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. వాహనంతో రోడ్డుపైకి వస్తున్నామంటే రహదారి భద్రతా నియమాలు తెలిసి ఉండాలని చెప్పారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యాన శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఆవశ్యకత, పిల్లలు వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వెంకటరమణ మాట్లాడుతూ వాహనదారులు అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలని తెలిపారు. కాగా, వాహనదారులు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని తెలిపారు. కాగా, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్‌టీవో కార్యాలయం వరకు కొనసాగగా రోడ్డు భద్రత నియమాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో వైరా, సత్తుపల్లి ఎంవీఐలు వరప్రసాద్, శ్రీనివాస్, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, వంశీ, ఏఓ జహీద్‌అలీతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు
పాలేరు పార్క్‌ల పరిశీలన
కూసుమంచి: మండలంలోని పాలేరులో రిజర్వాయర్ సమీపాన పార్క్‌లను శుక్రవారం అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. పాలేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇటీవల రూ.5కోట్లు మంజూరు కాగా, చేయాల్సిన పనులపై డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, జిల్లా పర్యాటక అధికారి సుమన్‌చక్రవర్తితో కలిసి పరిశీలించిన ఆమె వివరాలు తెలుసుకున్నారు. పార్క్‌లను అభివృద్ధి చేస్తే వచ్చే పర్యాటకులు ఆటవిడువుగా గడిపే అవకాశముంటుందని, అంతేకాక బోటింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment