బంజరు భూముల్లో సోలార్ ప్లాంట్లు
● 4వేల మెగావాట్ల మేర ఉత్పత్తికి అవకాశం ● రైతులను సంప్రదించేలా రెడ్‌కో అధికారుల ప్రణాళిక ● ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం
ఖమ్మంవ్యవసాయం: బంజరు భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలే కాక పంచాయతీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, భూమిని లీజ్‌కు తీసుకున్న వారు సైతం ఈ పథకంలో చేరేందుకు వీలుంది.
500 కిలోవాట్ల నుంచి
మూడున్నర ఎకరాలు మొదలు నాలుగు ఎకరాల బంజరు భూమి ఉన్న రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయా భూముల్లో 500 కిలోవాట్లు మొదలు 4వేల మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. దాదాపు అన్ని గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నందున సోలార్ ప్లాంట్ నుంచి సబ్‌స్టేషన్‌కు విద్యుత్ లైన్ల వ్యయం కూడా భారీగా ఉండదని భావిస్తున్నారు. ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్‌సీ) నిర్ణయించిన టారిఫ్ ఆధారంగా విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈమేరకు ఆసక్తి ఉన్న వారు www. tgredco. telangana.gov.in వెబ్‌సైట్‌లో లేదా 63049 03933, 90005 50974 నంబర్లలో ఈనెల 22వ తేదీలోగా సంప్రదించాలని టీజీ రెడ్‌కో అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంతేకాక బంజరు భూములు ఎక్కువగా గ్రామాలకు అధికారులు నేరుగా వెళ్లి రైతులను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు.
రైతులు వినియోగించుకోవాలి..
బంజరు భూములను వృథాగా వదిలేయకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేసుకుంటే ఆదాయం లభిస్తుంది. సాగుకు యోగ్యం కాని, నిరుపయోగంగా మారిన భూముల్లో ప్లాంట్ల స్థాపనకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి.
– ఏ.సురేందర్, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment