ఆకలితో చదవకుండా..
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి ఫలితాల పెంపుపై దృష్టి సారించిన రాష్ట్రప్రభుత్వం సూచనలతో రెండు నెలలుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అత్యధికంగా పేదలే కావడంతో ఉదయం నేరుగా పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేస్తున్నా సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరై ఇంటికి వెళ్లే సరికి ఆలస్యమవుతోంది. ఈక్రమాన ఆకలితో బాధపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం సాయంత్రం అల్పాహారం అందించాలని నిర్ణయించింది. వార్షిక పరీక్షలు మొదలయ్యే వరకు 38రోజుల పాటు అల్పాహారం సమకూర్చేందుకు నిధులు సైతం విడుదల చేసింది.
గత ఏడాది 92 శాతం
పదో తరగతి ఉత్తీర్ణత జిల్లాలో గత ఏడాది 92శాతంగా నమోదైంది. ఈసారి మరింత పెంచాలనే పట్టుదలతో ప్రభుత్వ సూచనలతో అధికారులు, ఉపాధ్యాయులు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, అనుబంధ యాజమాన్యాల పాఠశాలలు 283 ఉండగా, వీటిలో ఎస్సెస్సీ విద్యార్థులు 9,545 మంది చదువుతున్నారు. వీరికి ప్రతిరోజు ఉదయం 8నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4–15నుంచి 5–15గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యాన సాయంత్రం తరగతులు ముగిసి ఇంటికి వెళ్లేలోగా విద్యార్థులు నీరసంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని గుర్తించారు. కొన్నిచోట్ల దాతల చేయూతతో, ఇంకొన్నిచోట్ల ఉపాధ్యాయులు బిస్కెట్లు వంటివి సమకూరుస్తున్నా మెజార్టీ పాఠశాలల విద్యార్థులు ఆకలితోనే తరగతులకు హాజరవుతున్నారు. దీంతో ప్రభుత్వమే సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు నిర్ణయించింది.
38రోజులకు ప్రణాళిక...
ఈనెల 1వ తేదీ(శనివారం) నుంచి మార్చి 20వ తేదీ వరకు 38రోజుల పాటు పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15చొప్పున 9,545మందికి గాను రూ.54,40,650ను జిల్లాకు విడుదల చేశారు. దీంతో ఉడికించిన బొబ్బర్లు, పెసలు, పల్లీబెల్లం, శనగలు, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లి పకోడీ వంటి రోజుకొకటి సమకూర్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎస్సెస్సీ విద్యార్థులకు నేటి నుంచి అల్పాహారం
38రోజుల పాటు అందించేందుకు నిధులు
నేటి నుంచి అమలుచేస్తాం..
పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై ఇప్పటికే ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు అల్పాహారం సమకూర్చనున్నందున శ్రద్ధగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి.
– సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment