ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ
వైరా: వచ్చే ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఈనేపథ్యాన వైరాలోని గిడ్డంగుల సంస్థ గోదాంలను శుక్రవారం పరిశీలించిన ఆయన బియ్యం నిల్వలపై ఆరా తీశారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యాన సీఎంఆర్‌గా మిల్లర్లు అప్పగిస్తున్న బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు సూచించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన రామదాసు వారసులు
నేలకొండపల్లి: భక్తాగ్రేసరుడైన భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఆయన స్వస్థలమైన నేలకొండపల్లిలో శనివారం మొదలుకానున్నాయి. ఈసందర్భంగా ఆయన పదో తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు శుక్రవారం స్థానిక ధ్యాన మందిరంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. మందిర అర్చకుడు సౌమిత్రి రమేష్, భక్తరామదాసు విద్వత్ కళాపీఠం ప్రతినిధులు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తితో పాటు వంగవీటి నాగేశ్వరరావు, పసుమర్తి శ్రీనివాస్, గండికొట వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
వైరా: వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలో చేపట్టిన కుష్ఠు బాధితుల గుర్తింపు సర్వేపై ఆరా తీశారు. ఈనెల 13వరకు కొనసాగే సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి పరీక్షించాలని సూచించారు. అలాగే, మలేరియా, డెంగీ కేసుల నమోదు, చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడిన డీఎంహెచ్‌ఓ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ దుర్గ, పీహెచ్‌సీ వైద్యాధికారి టి.ఉదయలక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.
వరిని ఆశిస్తున్న
ఆకు ముడత తెగులు
కొణిజర్ల: కొణిజర్లలో పలువురు రైతులు సాగు చేసిన వరి పంటను శుక్రవారం వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈసందర్భంగా వైరా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ మాట్లాడుతూ వరి పిలక వేసే దశలో ఆకు ముడత తెగులు ఆశిస్తోందని తెలిపారు. ఈ పురుగు ఆశించినప్పుడు పత్రహరితాన్ని తినేస్తుండడంతో ఆకు నిలువునా ముడుచుకుంటుందన్నారు. అలాగే, పొలంలో గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులు కనిపిస్తున్నాయని, వీటి గుర్తింపునకు దుబ్బు నుంచి పిలకలు తీసి చూస్తే పసుపు రంగులో లార్వాను గమనించొచ్చని చెప్పారు. దీని నివారణకు ఎసిఫేట్ 75 ఎస్‌పీ 1.5 గ్రాములు లేదా కార్టాప్ లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ లేదా ప్లూబెండమైడ్ మార్చి మార్చి నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పీఎన్‌ఎం.ఫణిశ్రీ, ఏఓ డి.బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment