పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
భవానీపురం(విజయవాడపశ్చిమ): పశుసంవర్ధక సేవలను పశుపోషకులకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. జంతు సంక్షేమ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలోని పశువైద్యశాలలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి పశుసంవర్ధక శాఖ ద్వారా పశుపోషకులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం ఏపీ పశుగణాభివృద్ధి సంఘం (గన్నవరం) రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేగ దూడల అందాల పోటీని ఆసక్తిగా తిలకించి మేలు జాతి దూడల యజమానులకు ప్రోత్సాహకాలు అందించారు. పశు వ్యాధి నిర్ధారణ శాల సహాయ సంచాలకులు డాక్టర్ జి.సుజని నేతృత్వంలో మైక్రోస్కోప్ ద్వారా చేస్తున్న పశువుల రక్తం, పేడ పరీక్షలను పరిశీలించారు. 68 పశువులకు చికిత్సలు, 52 పశువులకు గర్భకోశ వ్యాఽధి చికిత్సలు, 18 పశువులకు చూడి పరీక్షలు, 84 దూడలు, 92 పెద్ద పశువులు, 136 గొర్రెలు–మేకలు, 290 పెరటి కోళ్లకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ టీ దామోదర నాయుడు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హనుమంతరావు, జిల్లా పశుగణాభివృద్ధి అధికారి డాక్టర్ శ్రీనివాసులు, విజయవాడ డివిజన్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జీ రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటర్నరీ హాస్పటల్ (నున్న) డాక్టర్ డీ రాజశేఖర్, గొల్లపూడి పశు వైద్యశాల డాక్టర్ హరీష్, డాక్టర్ రామారావు (ఎ కొండూరు), పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment