
అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి మృతి
కోడూరు: పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకొనేందు కు అర్థరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన బీటెక్ విద్యార్థి రెండు రోజుల తరువాత అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకొని శవమై కనిపించిన ఘటన కోడూరు మండలంలో సంచలనంగా మారింది. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన జరుగు సత్యనారాయణకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు లక్ష్మీ వర్థన్(22) కంచికచర్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం లక్ష్మీవర్థన్ ఇంటికి వచ్చాడు. ఈ నెల 2న ఉద యం లక్ష్మీవర్థన్ తోటి స్నేహితులతో కలిసి మాచవరం తుంగపల్లెమ్మ ఆలయం వద్ద జరిగిన కేటరింగ్ పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. 3న లక్ష్మీవర్థన్ పుట్టిన రోజు కావడంతో 2న రాత్రి 11గంటల స మయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన 10 నిమిషాలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు కుమారుడి ఆచూకీకోసం వెతుకులాట ప్రా రంభించారు. స్నేహితులు, బంధువుల ఇళ్లవద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 4న ఉద యం కోడూరు పోలీస్‌స్టేషన్‌లో కుమారుడు అదృశ్యమైయ్యాడని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.
సముద్ర తీరంలో చెట్టుకు వేలాడుతూ..
లక్ష్మీవర్థన్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు శనివారం ఉదయం బసవానిపాలెం – పాత ఉపకాలి గ్రామల మధ్య సముద్ర తీరంలోని ఓ చెట్టుకు యువకుడి శవం వేలాడుతుందనే సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా, ఆ శవం లక్ష్మీవర్థన్‌గా గుర్తించారు. పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్ష్మీవర్థన్ ఇంటి దగ్గర నుంచి మృతి చెందిన ఘటనా ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లక్ష్మీవర్థన్ శరీరమంతా రక్తపు మరకలు ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరో ప్లాన్ ప్రకారం హత్య చేశారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తన కుమారుడికి ఎవరితో వివాదాలు లేవని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ చెప్పారు. మృతుడి సెల్‌ఫోన్ లభ్యం కాలేదని, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఘటనాస్థలాన్ని సీఐతో పాటు ఎస్‌ఐ చాణిక్య, సిబ్బంది పరిశీలించారు.