
గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన సీఎం
నందిగామటౌన్: బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల సంక్షేమ వసతి గృహం, పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, పాఠశాలలోని విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి విద్యార్థులతో కలిసి తేనీటిని స్వీకరించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి వంటశాల, భోజనశాల పరిశుభ్రత ను, కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం భోజన రుచి, నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలను పరిశీలించి అభినందించారు.
వెలవెలబోయిన ప్రజావేదిక రోడ్లు..
నందిగామటౌన్: సీఎం చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలు ఆసక్తి చూపకపోవటంతో ప్రజావేదిక సభకు వెళ్లే రోడ్లు వెలవెలబోయాయి. సభా ప్రాంగణంలోకి ముప్పాళ్ల గ్రామ ప్రజలనే అనుమతించటంతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం సీఎం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ముప్పాళ్ల గ్రామ ప్రజలు కూడా ఒక మోస్తరుగా రావటంతో సభా ప్రాంగణానికి వెళ్లే రోడ్డు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వారు తప్ప సభా ప్రాంగణం వెలుపల పలుచగా టీడీపీ శ్రేణులు కనిపించారు. భోజన స్టాల్స్ వద్ద కూడా ఆశించిన మేర ప్రజలు లేకపోవటం గమనార్హం.

గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన సీఎం