చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ బాధ్యతలను మూడు రోజుల పాటు అదనంగా నిర్వహించనున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో సీతారామ కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామ నవమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణం కనుల పండువగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదికను కల్యాణ వేడుకకు ముస్తాబు చేశారు. ఘాట్‌రోడ్డులోని వీరాంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీసీతారామ లక్ష్మణ, వీరాంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అర్చకులు, వేద పండితులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం సీతారాముల కల్యాణం విశిష్టతను అర్చకులు తెలిపారు. కల్యాణాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, యజ్ఞనారాయణ శర్మ ఇతర అర్చకులు, వేద పండితులు జరిపించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా కళావేదిక వద్ద కూలర్లు ఏర్పాటు చేశారు.
4.10 ఎకరాల భూమి విరాళం
నందివాడ: శ్రీరామనవమి సందర్భంగా నందివాడ మండలంలో లక్ష్మీ నరసింహపురంగ్రామం కొత్తూరు సెంటర్లోని శ్రీ కోదండ రామాలయానికి పమిడి అచ్యుతరావు, మణిమ్మ దంపతులు 4.10 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. ఆలయ కమిటీ పెద్దలు సింగ వరపు సత్యనారాయణ, సువ్వారి వెంకట రంగారావు, హనుమంతు పాపారావు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలకు ‘ఎల్‌హెచ్‌ఆర్’ విద్యార్థి
మైలవరం: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మైలవరం ఎల్‌హెచ్‌ఆర్ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి సీహెచ్ దుర్గాప్రసాద్ కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికై నట్లు కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి ఆదివారం తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్‌లోని భారత జాతీయ అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రసాద్ ప్రతిభ చూపి 67 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడని ఆయన తెలిపారు. అతను ఎంపిక కావడం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి పేర్కొన్నారు. అతన్ని కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.
వేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవం
తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ అర్చకుడు తిరునగరి గోపాలాచార్యులు ఆధ్వర్యాన స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. దత్తత దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో రామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం చేశారు. ఆలయ సహాయ కమిషనర్ సంధ్య పర్యవేక్షించారు.

దుర్గమ్మ సన్నిధిలో సీతారామ కల్యాణం

ఢిల్లీకి కృష్ణా జేసీ