
తప్పిన పెనుప్రమాదం
గుడివాడరూరల్: స్థానిక రాజేంద్రనగర్‌లోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఓ అపార్టుమెంట్ 2వ అంతస్తు ఫ్లాట్ నంబరు 202లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరుగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకానున్న దేవదాయశాఖ కమిషనర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఈనెల 8వ తేదీన హాజరుకానున్నారు. దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తన ఉద్యోగోన్నతి వ్యవహారంలో అన్యాయం జరుగుతుందంటూ గతనెలలో జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో 8వ తేదీన ఢిల్లీలోని కమిషన్ కార్యాలయానికి రావాలంటూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఫిర్యాదీ నాగేశ్వరరావుకు ఆదేశాలు అందాయి. 2021లో ఆలయ చీరల విభాగంలో గోల్‌మాల్ జరిగిందంటూ నాగేశ్వరరావును దేవస్థానం ఉన్నతాధికారులు ఐదునెలలపాటు సస్పెండ్ చేశారు. ఈవ్యవహారంతో నాగేశ్వరరావుకు రావాల్సిన ఇంక్రిమెంట్, ప్రమోషన్ నిలిచిపోయింది. దీంతో కోర్టును ఆశ్రయించిన నాగేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ చీరలను ఆలయ అధికారులకు లెక్క చూపారు. ఈ విషయంపై ప్రత్యేక కమిటీ సైతం నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో 8వ తేదీన జరిగే విచారణకు ప్రమోషన్‌కు సంబంధించి అన్ని ఒరిజినల్ రికార్డులతో హాజరు కావాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్ దేవదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అపార్టుమెంట్‌లో మంటలు
అదుపుచేసిన ఫైర్ సిబ్బంది