పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే తరచూ వినపడే మాట చాలెంజ్ ఓటు. చాలెంజ్ ఓటు అంటే ఏమిటి...దానిని ఎప్పుడు వేస్తారు.. దీనికి ఎలాంటి విధి విధానాలు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలెంజ్ ఓటుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఒక ఓటరు బీఎల్‌వోలు ఇచ్చిన స్లిప్ తీసుకొని ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళతారు.
అప్పుడు పోలింగ్ కేంద్రంలోని రాజకీయ పార్టీల ఎన్నికల ఏజెంట్లు ఆయన ఓటరు కాదని ఓటు వేయడానికి అనుమతించరాదని పేర్కొంటారు. అప్పుడు ఓటరు కూడా తాను నిజమైన ఓటరునని వాదిస్తారు. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎన్నికల ఏజెంటుతో ఓటరుపై చాలెంజ్ చేస్తావా అంటూ అడుగుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంటు అంగీకరిస్తే సదరు ఏజెంటు ఫీజు కింద రూ.2 చెల్లించాలి. అప్పుడు ఓటరు గురించి అక్కడే ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు.
మీ తల్లి తండ్రి పేర్లు ఏమిటి, మీ ఇంటి నంబరు ఎంత... మీ ఇంటిలో ఉన్న వారి పేర్లు ఏమిటి? ఇంటికి ఇరువైపులా ఎవరెవరు ఉన్నారు...? వారి పేర్లు ఏమిటి తదితర వివరాలు అడుగుతారు. అన్నింటికీ సరిగ్గా జవాబు చెబితే అవి ఓటర్ల జాబితాలోని వివరాలతో సరిపోతే ప్రిసైడింగ్ అధికారి ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఏజెంటు అభ్యంతరం వీగిపోతుంది. ఈ ప్రక్రియనే చాలెంజ్ ఓటుగా వ్యవహరిస్తారు.
ఓటరు తగిన స్లిప్‌లతో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఏజెంటు అభ్యంతరం చెబితే చాలెంజ్ ఓటుకు అవకాశం ఉంది. అభ్యంతరం చెప్పారు కదా అని వెనక్కివస్తే విలువైన ఓటును నష్టపోవాల్సి వస్తుంది.
కర్నూలు(సెంట్రల్)
Comments
Please login to add a commentAdd a comment