యువకుడిపై పోక్సో కేసు | Sakshi
Sakshi News home page

యువకుడిపై పోక్సో కేసు

Published Fri, May 24 2024 10:20 AM

యువకుడిపై పోక్సో కేసు

పత్తికొండ రూరల్‌ : పత్తికొండలోని ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్న సుధాకర్‌ అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీమోహన్‌ గురువారం తెలిపారు. సుధాకర్‌ కొద్దిరోజులుగా బాలికకు మాయమాటలు చెప్పి ఫొటోలు తీసుకున్నాడు. ఫొటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేసి వేలాది రూపాయల డబ్బులు లాక్కున్నాడు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాలిక తండ్రికి విషయాన్ని తెలిపింది. యువకుడిని మందలించేందుకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులపై సుధాకర్‌ తండ్రి చిన్ననరసప్ప, తల్లి ఈశ్వరమ్మ, కుటుంబీకులు పెద్దనరసప్పలు దాడికి పాల్పడ్డా రు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వివాహేతర సంబంధం

అంటగట్టి...

పెళ్లి చేసుకోవాలని బెదిరింపు

కృష్ణగిరి: తన కుమారుడికి మరో అమ్మాయితో వివాహేతర సంబంధం అంటగట్టి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బెదిరించారంటూ మండల పరిధిలోని తొగర్చేడు గ్రామానికి చెందిన శకుంతలమ్మ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అదే గ్రామానికి చెందిన ఆరుగురిపై, కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. గతేడాది జనవరి 12న రాత్రి తాను తన కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించి తమను దుర్భాషలాడుతూ, తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ లేకపోతే చంపుతామంటూ బెదిరించా రని శకుంతలమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులు 10మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

కర్నూలు (టౌన్‌): రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరిని గురువారం స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలోని వ్యాయామ హాలులో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ కార్యదర్శి వేణుగోపాల్‌ ఎంపికై న లిఫ్టర్లను ప్రకటించారు. 61 కిలోల క్యాటగిరీలో ఇస్మాయిల్‌, రవి యువరాజ్‌, లక్ష్మీనరసింహ, మధుతేజ, 93 కిలోల క్యాటగిరీలో మహేష్‌రావు, 65 కిలోల క్యాటగిరీలో శంకర్‌, బాలికల 61 కిలోల విభాగంలో ధీరజ, రాధిక, జూనియర్స్‌ 54 కిలోల క్యాటగిరిలో వెంకటలక్ష్మి, పుష్ప, సీనియర్స్‌ 88 కిలోల విభాగంలో నాగమణి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంపికై న వారు ఈనెల 29 నుంచి 31 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement