దైవ దర్శనానికి వెళ్తూ..
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరంలో వెలిసిన సంగమేశ్వరుడి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండ్లెం గ్రామానికి చెందిన పోతులరాజు మద్దిలేటి, బాలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సందీప్‌కుమార్‌బాబు తిరుపతిలోని ఐఎఫ్ ఎఫ్‌టీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా బుధవారం తన మిత్రుడు తంగడంచ గ్రామానికి చెందిన శివకుమార్‌తో కలిసి బైక్‌పై సప్తనదుల సంగమేశ్వరాలయానికి వెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం ఆలయ అర్చకుడు తగ్గిన కృష్ణా జలాల్లో నడుచుకొంటూ ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేసి రావటాన్ని గమ నించారు. వారు కూడా ఆలయం వద్దకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు కృష్ణాజలాల్లో నడుచుకొంటూ వెళ్లసాగారు. కొద్దిదూరం వెళ్లాక శివకుమార్ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఒడ్డుపై పెట్టివస్తానని బయటకు వచ్చాడు. సందీప్‌కుమార్‌బాబు ఒక్కడే నీళ్లల్లో నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం సమీపిస్తుండగానే అక్కడ లోతైన గుంతలోని పూడికలో కూరుకపోయి మునిగిపోయాడు. శివకుమార్ గమనించి కేకలు వేయటంతో సమీపంలోని మత్స్యకారులు పుట్టిల్లో వెళ్లి నీట మునిగిన సందీప్‌కుమార్‌బాబును ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకన్న యువకుడి తల్లిదండ్రులు సంగమేశ్వరానికి చేరుకుని విలపించారు. సమాచారం అందుకున్న కొత్తపల్లి ఎస్‌ఐ ఎం.కేశవ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బాబాయి బుజ్జన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
సంజామల: మండల పరిధిలోని మంగపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్‌ఐ రమణయ్య బుధవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment