
కుట్ర కని‘పింఛన్’
వైఎస్సార్‌సీపీ పాలనలో
ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్‌లు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్‌లు ఇవ్వడం విశేషం. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లను అర్హులకు అందించారు. రాజకీయాలకు అతీతంగా.. అర్హతే ప్రామాణికంగా పింఛన్‌లకు ఎంపిక చేశారు. గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు వలంటీర్లు ఇంటి వద్దకే మంజూరు పత్రం అందించిన రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
నమ్మించి మోసగించారు
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. నాకు 57 ఏళ్లు పూర్తయ్యాయి. టీడీపీ ప్రకటించిన ప్రకారం నాకు పింఛనుకు అర్హత ఉంది. సచివాలయానికి వెళితే దరఖాస్తు కూడా తీసుకోవడం లేదు. ఆకు వక్క, బీడీ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంది. నమ్మించి మోసం చేయడం తగదు.
– యు.సురేష్, ఆర్లబండ, కోసిగి మండలం
ఇంటింటికీ పింఛన్ల పంపిణీ
నామమాత్రమే!
ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ క్రమంగా కొండెక్కుతోంది. పింఛను పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశారు. ఆ ప్రాంతం నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) పరిధిలో పింఛను పంపిణీ చేసే వీలుకల్పించారు. అయినప్పటికీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 80 శాతం పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాలు.. రచ్చబండల వద్దే జరుగుతోంది. ఈ విషయమై అధికారులు ప్రశ్నిస్తే.. సచివాలయ ఉద్యోగులు నెట్‌వర్క్ సమస్య, ఇతరత్రా ఇబ్బందులను చెబుతున్నట్లు తెలుస్తోంది.
పది నెలల్లో 14,497 పింఛన్ల తొలగింపు
● వెరిఫికేషన్ ముసుగులో కోతలు
● ఎన్నికలకు ముందు 50 ఏళ్లకే
పింఛను ప్రచారం
● ఇప్పటి వరకు కొత్త పింఛన్ల
ఊసే కరువు
● 3.50లక్షల మంది ఎదురుచూపులు
● గ్రీవెన్స్‌ల్లోనే 1.56 లక్షల దరఖాస్తులు
జిల్లా గత ఏడాది జూన్‌లో పింఛన్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో పింఛన్లు
కర్నూలు 2,45,687 2,38,302
నంద్యాల 2,21,702 2,14,590
పింఛన్ల కోత ఇలా..
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసే కరువైంది. ఇదే సమయంలో ప్రతినెలా ఉన్న పింఛన్లనే తొలగిస్తున్న పరిస్థితి. తాజాగా పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడంతో వస్తున్న పింఛను ఉంటుందో, ఊడుతుందోననే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఆకు, వక్కలు కొనాలన్నా దిక్కులు చూడాల్సి వస్తోందని.. ఇక ఆరోగ్యం బాగోలేక మందులు కొనాలంటే ఎవరిని అడిగేదని అవ్వాతాతలు కన్నీరు పెడుతున్నారు. సూపర్–6 మాయలో పడి మోసపోయామని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు లబోదిబోమంటున్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు ఆశలు రేకెత్తించారు. ఇప్పుడు కొత్త పింఛనల మాట దేవుడెరుగు, ఉన్న పింఛన్లనే తొలగిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతినెలా పింఛన్లలో కోత పడుతోంది. 10 నెలల కాలంలో గుట్టు చప్పుడు కాకుండా 14,497 పింఛన్లు తొలగింపులకు గురయ్యాయి. గత ఏడాది జూన్ నెలలో 4,67,389 పింఛన్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి పింఛన్ల సంఖ్య 4,52,892కు పడిపోయింది. తొలగించిన వారి స్థానంలో కొత్త పింఛన్‌లు ఇచ్చినా కొంతమందికై నా న్యాయం జరుగుతుంది. అలాకాకుండా పింఛన్లలో కోత విధిస్తూ, కొత్త పింఛన్ల ఊసెత్తకపోవడం గమనార్హం.
కొనసా..గుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ
దివ్యాంగులు, హెల్త్ పింఛను లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారనే నిర్ధారణకు వచ్చిన కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. వారంలో మంగళ, బుధ, గురువారాల్లో పింఛన్లను మెడికల్ బోర్డుకు పిలిపించి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 6వేలు, నంద్యాల జిల్లాలో 5వేల పింఛన్లను మాత్రమే వెరిఫై చేశారు. ఇంకా దాదాపు 48వేల పింఛన్లను పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత వితంతు పింఛన్లను కూడా పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
పింఛన్ల కోసం వినతుల వెల్లువ
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అవ్వతాతలు దాదాపు 3.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 60 శాతం మందికి పింఛన్లకు అర్హులే. అయితే వీరిని పట్టించుకున్న దాఖలాలులేవు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌కు పింఛను వినతులు వెల్లువెత్తుతున్నాయి. గత జూన్ నెల 12 నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దాదాపు 1.56 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

కుట్ర కని‘పింఛన్’