సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇంట్లోకి చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగినప్పటికీ.. ఇంకా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం అందడంలేదు. దీంతో స్థానిక అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులపై సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. (హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ పరిధిలోని మిధిలాపూర్ కాలనీలో వరద బాధితుల వద్దకు వెళ్లిన మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా వర్షాలు, వరదలు వస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై భైఠాయించి కాసేపు నిలువరించారు. అక్కడకు పోలీసులు భారీగా చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తంగా మారింది. దీంతో వాహనం దిగి స్థానికుల వద్దకు వచ్చిన సబిత.. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిత్యవసర వస్తువులతో పాటు ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి హామీతో స్థానికులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment