భద్రత లేని ప్రైవేట్‌ పాఠశాల బస్సు.. పసి ప్రాణాలతో చెలగాటం..! | - | Sakshi
Sakshi News home page

భద్రత లేని ప్రైవేట్‌ పాఠశాల బస్సు.. పసి ప్రాణాలతో చెలగాటం..!

Published Thu, Aug 3 2023 1:24 AM | Last Updated on Thu, Aug 3 2023 12:22 PM

- - Sakshi

వరంగల్‌: అనుభవం లేని డ్రైవర్లు.. అర్హత లేని క్లీనర్లు.. నిబంధనలు పాటించని ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు.. డ్రైవర్‌ లైసెన్స్‌ ఉందా..? బస్సు కండిషన్‌ ఎలా ఉంది..? విద్యార్థుల భద్రకు తీసుకున్న చర్యలు ఏమిటి..? అనే విషయాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాల్సిన అధికారుల మామూళ్ల మత్తు.. వెరసి విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి.

రోజురోజుకూ ప్రైవేట్‌ స్కూల్స్‌, కళాశాల బస్సుల్లో ప్రయాణం దినదిన గండంగా మారుతోంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఏదైనా ప్రైవేట్‌ పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చే బస్సులను గమనిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. బాక్స్‌లో అన్నం కుక్కినట్లు చిన్నారులను బస్సుల్లో కుక్కి తీసుకొస్తున్న తీరు అశ్చర్యపరుస్తుంది.

తమ పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయే తల్లిదండ్రులు వారిని పాఠశాలకు తరలించే బస్సుల విషయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. బస్సు డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉందా..? బస్సు కండిషన్‌లో ఉందా..? లేదా అనే విషయాలను పట్టించుకోవడం లేదు.

నిబంధనలకు నీళ్లు..
నిబంధనల ప్రకారం వాహన పరిమితికి మంచి విద్యార్థులను తరలించొద్దు. అయినా ప్రైవేట్‌ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా నిబంధనలకు నీళ్లు చల్లతూ పరిమితికి మించి తరలిస్తున్నాయి. ఫలితంగా బస్సులు అదుపు తప్పడంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బస్సులకు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌సీ) పొందడంలో నిర్లక్ష్యం వ్యహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే, లైసెన్స్‌లు లేకుండానే.. తక్కువ జీతంతో అనుభవం గల బస్సు డ్రైవర్లుగా నియామకాలు చేపడుతున్నాయి. దీంతో ఆ డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఓవర్‌ స్పీడ్‌, మద్యం మత్తు విద్యార్థుల ప్రాణాల మీదికి వస్తోంది. ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణించడం.. మలుపుల్లో అదుపు తప్పి బస్సులు పంటపొలాల్లోకి దూసుకెళ్లడం..బోల్తా పటడం.. విద్యార్థులు గాయాల పాలవుతున్నా అధికారులకు చలనం లేదు. దీని మూలంగా యాజమాన్యాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్టీఏలో చేయి తడిపితేనే ఎఫ్‌సీ..
ప్రైవేట్‌ విద్యా సంస్థలు చేయి తడిపితే ఆర్టీఏ అధికారులు ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్కూల్‌ బస్సులకు 31 అంశాలతో పాటు మరికొన్ని తనిఖీలు చేయాలంటే ఒక్కో బస్సుకు సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఇలా ఎంవీఐ రోజుకు 10 బస్సులు తనిఖీ చేయాలి.

ఈ లెక్కను ఒక ఎంవీఐకి సమారు 5 గంటలు పడుతుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయల్లో ఎంవీఐలు ఈ విధంగా తనిఖీ చేస్తున్నారా..? అని పరిశీలిస్తే ఎక్కడా కనిపించడం లేదు. బస్సును 10 నిమిషాల్లోనే తనిఖీ చేయడం ముగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బస్సు కండిషన్‌ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడుతే రూ.4 నుంచి 5వేల వరకు చేతిలో డబ్బు పెట్టగానే క్షణాల్లో చేతికి ఫిట్‌నెస్‌ చేరిందని కొంతమంది యాజమాన్యాలు బహిరంగాంగానే చెబుతున్నాయి. బస్సు ఫిట్‌నెస్‌కు వచ్చిందా..ఆన్‌లైన్‌ చేశాయిండా.. మనకు ఎన్ని డబ్బులు ముట్టాయి అనే విషయంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

స్కూల్‌ బోల్తాపై చర్యలు ఏవీ..?
మొన్న కేసముద్రం మండల కేంద్రం..నిన్న మామునూరు.. నేడు మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల బొడ్లాడ గ్రామ రోడ్డుపై స్కూల్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. బొడ్లాడలో పంట పొలాల్లో బురద ఉండటంతో ప్రాణ హానిలేదని, విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.

ప్రమాదాలపై రాజకీయ జోక్యంతో మొక్కబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అలసత్వం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

తనిఖీలు కొనసాగుతున్నాయి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిసారించాం. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుపై నడిపిస్తే సీజ్‌ చేశాం. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ పూర్తి చేయాలని ఎంవీఐలను ఆదేశించాం. స్కూల్‌ బస్సులపై తనిఖీలు చేపడుతున్నాం. సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తే చర్యలు తీసుకుంటున్నాం. ఎఫ్‌సీ పొందని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. – పురుషోత్తం, డీటీసీ హనుమకొండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement