
మహబూబాబాద్: తల్లి మందలించిందనే కారణంతో మనస్తాపం చెందిన ఓ బాలిక.. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం జీపీ పరిధిలోని జీన్యతండాలో జరిగింది. తండాకు చెందిన గుగులోత్ దూబ్‌సింగ్, వినోద దంపతుల కూతురు వర్షిత (10) తండాలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.
తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లింది. చాలా సమయం తర్వాత ఇంటికి వచ్చిన బాలికను తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.