
కొల్లాపూర్ పట్టణ వ్యూ
కొల్లాపూర్: సురభి రాజుల సంస్థానంలో భాగమైన కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రతి ఎన్నికలోనూ విలక్షణంగా ఉంటుంది. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో అంచనా వేయడం కష్టమే. తప్పనిసరిగా ఓడిపోతాడనుకున్న అభ్యర్థిని గెలిపిస్తూ.. గెలిచి తీరుతాడనుకున్న అభ్యర్థిని ఓడిస్తూ.. నియోజకవర్గ ఓటరు అందరి అంచనాలను తలకిందులు చేస్తుంటారు.
మొదటిసారి కమ్యూనిస్టు అభ్యర్థికి పట్టం కట్టిన కొల్లాపూర్‌వాసులు ఆ తర్వాత 1978 నుంచి 2014 ఎన్నికల వరకు పది పర్యాయాలుగా వరుసగా వెలమ కులస్థులను అందలం ఎక్కించారు. వెలమలను ఓడించి ఎమ్మెల్యే పదవి చేపట్టాలని గత నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రయత్నించగా.. చివరికి 2018లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించి వెలమల అప్రతిహిత విజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈసారి కూడా వెలమ, రెడ్డి సామాజిక వర్గాల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది.
మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు
నియోజకవర్గంలో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి రంగదాసుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బి.నర్సింహారెడ్డి 1,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను కొత్త వెంకటేశ్వర్‌రావుకు కేటాయించింది. దీంతో కె.రంగదాసు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వెంకటేశ్వర్‌రావుపై 3,558 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2004లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తు కారణంగా టికెట్‌ను బీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కటికనేని మధుసూదన్‌రావుపై జూపల్లి 3,040 ఓట్ల తేడాతో గెలుపొందారు.
పోటాపోటీ రాజకీయం..
నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటాపోటీ రాజకీయం నడిచేది. 1983 నుంచి 2012 వరకు టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు ఎన్నికల బరిలో నిలిచారు. 1985, 1989, 2014, 2018 పొత్తుల కారణంగా పోటీ చేయలేదు. 1994లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి కటికనేని మధుసూదన్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి రామచందర్‌రావుపై 33,774 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
గెలుపు అవకాశాలున్నప్పటికీ గ్రూపు తగాదాల కారణంగా 1999, 2004, 2009లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. చివరగా 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయగా.. 35 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
వరుసగా పదిసార్లు..
1978 నుంచి కొల్లాపూర్‌లో 2014 వరకు మొత్తం పదిసార్లు వరుసగా వెలమ కులస్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు కొత్త వెంకటేశ్వర్‌రావు విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కొత్త రామచందర్‌రావు గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కటికనేని మధుసూదన్‌రావు, 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుసగా జూపల్లి కృష్ణారావు విజయకేతనం ఎగురవేశారు.
బీసీలు, ఎస్సీలే కీలకం..
కొల్లాపూర్ నియోజకవర్గంలో 75శాతానికిపైగా బీసీలు, ఎస్సీల ఓట్లే ఉన్నాయి. రెడ్డి కులస్థుల ఓట్లు 23 వేల వరకు ఉండగా.. వెలమల ఓట్లు 5 వేలలోపే ఉన్నాయి. బీసీల్లో అధిక శాతం ఓట్లు యాదవులవి కాగా.. ఎస్సీలో మాదిగలవి అధిక శాతం ఓట్లు ఉన్నాయి. విశేషమేమంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి, వెలమ కులస్థులే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మూడుసార్లు రెడ్డి కులస్థులు గెలవగా.. బీసీ నేత కె.రంగదాసు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment