మహబూబ్‌నగర్ క్రైం: కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్లపై రాష్ట్ర పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనం దగ్గరి నుంచి భారీ వాహనాల వరకు కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న చలాన్స్ చెల్లించడానికి ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.
వాహనదారుల నుంచి పెండింగ్ జరిమానాలు రాబట్టేందుకు భారీస్థాయిలో రాయితీలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులపై 90 శాతం, ద్విచక్ర వాహనాలపై 80 శాతం, ఆటోలు, కార్లు ఇతర ఫోర్ వీలర్స్‌పై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి పెండింగ్ చలాన్స్ వసూలు చేసే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,99,841 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9,36,67,245 వసూలు కావాల్సి ఉంది. అత్యధికంగా మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో 77,237 కేసులు ఉండగా, అత్యల్పంగా చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,076 ఈ–చలాన్ కేసులు పెండింగ్లో ఉండడం విశేషం.
జిల్లాలో ఇప్పటివరకు ఈ–చలాన్ కేసులు 2,28,622 నమోదు చేయగా వీటి ద్వారా రూ.10,71,64,164 జరిమానాలు విధించారు. ఇందులో 58,953 కేసులలో రూ.2,90,23,180 జరిమానాలు చెల్లించారు. ఇంకా 1,99,841కేసులలో రూ.9,36,67,245 జరిమానాలు ప్రభుత్వానికి చెల్లించాలి.
సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ కల్పించిన క్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతాం. – టి.మహేష్, డీఎస్పీ మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment