కృష్ణా: మండల సరిహద్దులోని చేగుంట గ్రామ శివారులో కర్ణాటకకు చెందిన ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మంగళవారం రాత్రి ఎదురెదురుగా ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని వాడి పట్టణానికి చెందిన మర్‌లింగా మరియు రాజ్‌కుమార్ బైక్‌పై బెంగళూర్‌కు వెళ్తుండగా.. శక్తినగర్ నుంచి అనిల్‌కుమార్, మనోహర్ బైక్‌పై తమ స్వగ్రామమైన కడెచూర్‌కు వెళ్తూ.. ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ సమయంలో అనిల్‌కుమార్ రోడ్డుపై పడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న మరో వాహనం అనిల్‌కుమార్‌పై వెళ్లడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ ఘటనపై ట్యాంకర్ డ్రైవర్, బైక్ నడుపుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మెడికల్ విద్యార్థి..
చిట్యాల(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో మృతిచెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన బిరుదు సాయితేజ(20) నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో డెంటల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ తనతో కలిసి చదువుకుంటున్న యశస్వీతో కలిసి సోమవారం ఉదయం బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రానికి వెళ్లి మద్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యలో చిట్యాల వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను భువనగిరి వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా పడిన సాయితేజ, యశస్వీని పోలీసులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
సాయితేజ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బల్మూర్: మండలంలోని కొండనాగులకి చెందిన యువకుడు మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొండనాగులకి చెందిన ఆంజనేయులు(30) సోమవారం గ్రామానికి వచ్చి అత్తగారి గ్రామం వంగూరు మండలం చౌదర్‌పల్లికి వెళ్లి మంగళవారం ఉదయం బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో తుక్కుగూడ వద్ద డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడికి భార్య నిర్మలతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఫహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి మృదదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహం లభ్యం
కోస్గి: చేపల వేటకు చెక్‌డ్యాంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫాకు చెందిన బుడగజంగం వెంకటయ్య(32) సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లాడు. అయితే ఈత రాకపోవడంతో లోతుకు వెళ్లి మునిగిపోయాడు.
ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా దుస్తులు కనిపించడంతో గ్రామస్తుల సహకారంతో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఉదయం పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు వాగులో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ తెలిపారు.
చిరుత కలకలం
అచ్చంపేట రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా గుంపన్‌పల్లి శివారులో చిరుత కలకలం సృష్టిస్తోంది. పశువులపై దాడి చేసి చంపిన సంఘటనలు మరవకముందే ఓ హిళపై దాడికి యత్నించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం గుంపన్‌పల్లికి చెందిన సబావట్ రమ తమ వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని ఆవులు, ఇతర పశువులను తీసుకుని సమీప చెరువు వద్ద నీళ్లు తాపడానికి వెళ్లింది.
ఈ క్రమంలో చెట్ల పొదల్లో ఉన్న చిరుత ఒక్కసారిగా మహిళపై దాడికి యత్నించింది. గమనించిన ఆ మహిళ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న సమీప పొలాల రైతులు, కూలీలు అక్కడికి చేరుకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో రైతులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సి వస్తోందని..బోనులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... అధికారుల నుంచి స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment