మహబూబ్‌నగర్: కాంగి‘రేసు’లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో ఉమ్మడి పాలమూరు నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. ఇంకా ఆరు స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కుతుందనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వీటికి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయినప్పటికీ.. బహుముఖ పోటీ నేపథ్యంలో అసమ్మతి పెల్లుబికుతుందనే భయంతో ఆచితూచి వ్యవహరిస్తూ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో రెండో విడత జాబితా ప్రకటించనున్నట్లు ఏఐసీసీ పెద్దలు వెల్లడించగా.. ఆయా స్థానాలపై సస్పెన్స్ వీడనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఐదు పెండింగ్..
ఉమ్మడి పాలమూరులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు కాగా.. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో ఏడు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, షాద్‌నగర్), నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్) ఉన్నాయి. కాంగ్రెస్ తొలి విడతలో ఎనిమిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.
పెండింగ్‌లో పెట్టిన ఆరు స్థానాల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గంలోని వనపర్తితోపాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో అధికంగా ఐదు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట) సెగ్మెంట్లు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి అభ్యర్థులు పోటీ పడుతుండడం.. సామాజిక వర్గ సమీకరణలు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
వర్గాల వారీగా ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 12 జనరల్ కాగా.. రెండు (అచ్చంపేట, అలంపూర్) ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు. తొలివిడతలో కాంగ్రెస్ ప్రకటించిన ఎనిమిది స్థానాల అభ్యర్థులను పరిశీలిస్తే ఆరు జనరల్ స్థానాల్లో ముగ్గురు రెడ్డి, ఒకరు వెలమతోపాటు బీసీ వర్గాలకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. రెండు రిజర్వ్‌డ్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులను కేటాయించారు.
కాంగ్రెస్ పాతకాపులు ముగ్గురే..
ఈసారి తొలి విడతలో ప్రకటించిన అభ్యర్థులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారిని పరిశీలిస్తే.. రేవంత్‌రెడ్డి (కొడంగల్), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట), సంపత్ (అలంపూర్) మాత్రమే ఉన్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నుంచి, షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్ బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), సరితా తిరుపతయ్య (గద్వాల) ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలవనున్నారు. 1999లో జూపల్లి కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఎన్నికలో గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో 2011లో కాంగ్రెస్‌కు, మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్)లో చేరారు. బీఆర్‌ఎస్ నుంచి 2012 ఉప ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో ఓటమి పాలయ్యారు.
వారి దారెటు..
కాంగ్రెస్‌లో పలువురు నేతల చేరికల క్రమంలో ప్రధానంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌కు సంబంధించి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేతలు, వారి అనుచరుల్లో అసంతృప్తి పెల్లుబికింది. కూచుకుళ్లపై నాగం జనార్దన్‌రెడ్డి, జూపల్లిపై చింతలపల్లి జగదీశ్వర్‌రావు నిత్యం ఫైర్ అవుతూ వచ్చారు. నాగం వర్గీయులు ఇటీవల గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సైతం తెలిపారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని.. ఇంకా టికెట్లు ఖరారు కాలేదని నేతలు సముదాయించడంతో వెనుదిరిగారు.
ప్రస్తుతం కొల్లాపూర్ టికెట్ జూపల్లి, నాగర్‌కర్నూల్ టికెట్ కూచుకుళ్లకు కేటాయించిన నేపథ్యంలో నాగం, చింతలపల్లి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో జగదీశ్వర్‌రావు అనుచరులు ఫ్లెక్సీలు చించివేశారు. తాను ఢిల్లీ నుంచి వస్తున్నానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని జగదీశ్వర్‌రావు వారిని వారించినట్లు తెలుస్తోంది.
కొత్తగా చేరిన వారికే పెద్దపీట..
మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు తొలిజాబితాలో పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కొల్లాపూర్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, గద్వాలకు చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య చేయి అందుకున్నారు. ఆ తర్వాత కల్వకుర్తి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరగా.. వీరందరికి తొలి జాబితాలోనే సీట్లు కేటాయించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment