మంగళవారం ఉదయం సుమారు 8.20గంటలు..
జైపూర్ మండలం ఇందారం గ్రామం..
ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. గ్రామానికి చెందిన ముస్కే మహేశ్(27) మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు. అతడిపై కక్ష పెంచుకున్న కుటుంబం నడిరోడ్డుపై అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే నలుగురు కలిసి కత్తి, ఇటుక, బండరాయితో మహేశ్ తలపై బాదుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అప్పటి దాకా ప్రశాంతంగా గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తీవ్ర రక్తస్రావంతో ఆ యువకుడు కొద్ది సేపటికే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరూ అడ్డుచెప్పలేదు. అనంతరం దాడి చేసిన నలుగురు ఓ ఆటోలో ఎక్కి మంచిర్యాల వైపు పారిపోయారు. దాడి దృశ్యాలను ఆ సమయంలో అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో జిల్లా వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
► ఈ నెల 11న ఉదయం 11.15గంటలకు మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్ పరిధి గద్దెరాగిడిలోని చాకలివాడలో రియల్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతారావు(63) దారుణంగా హత్యకు గురయ్యాడు. భూ వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది. పలు భూ వివాదాలు ఉండడంతో ప్రత్యర్థులు పక్కా ప్లాన్ వేసి చంపేశారు.
► గత డిసెంబర్ 16న మందమర్రి మండలం గుడిపల్లి శివారు వెంకటాపూర్‌లో ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో ఆరుగురు సజీవ దహమయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు సైతం కాలి బూడిదయ్యారు. తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడనే కోపంతో మహిళ మరో ఇద్దరితో కలసి పక్కాప్లాన్‌తో దాడి చేసి చంపింది. ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం రేపింది. ఒక్కరిపై కోపంతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పలు వివాదాలు, భూ తగాదాలు కక్షలతో ఏకంగా మనుషుల ప్రాణాలే తీస్తున్నాయి. తాజాగా ఇందారం గ్రామంలో జరిగిన ఘటనలో యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం.. విభేదాలే కారణం. ఇందారం గ్రామం నజీర్‌పల్లికి చెందిన ముస్కే మహేశ్, ఇదే గ్రామానికి చెందిన పెద్దపల్లి శృతి చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో శృతి సీసీసీకి చెందిన పెంట శివను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా మహేశ్, శృతి మధ్య సంబంధం కొనసాగడం, ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో అటు భర్త కుటుంబం, ఇటు యువతి కుటుంబంలో చిచ్చురేపింది. భార్య తీరుతో భర్త శివ కలత చెంది విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకోవడం వారి ఇంట విషాదాన్ని నింపింది. ఇటు శృతి పుట్టింటికి చేరింది. పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు కావడం, వేధింపులు పెరగడంతో యువతి కుటుంబం పగ పెంచుకుంది. తెలిసీ, తెలియక చేసిన తప్పులతో అనేక కుటుంబాల్లో ఘర్షణకు దారి తీస్తున్నాయి.
కక్షలతో రగిలిపోతూ..
ఇటీవల జరిగిన ఘటనలతో గొడవలు ఏవైనా కక్షలతో రగిలిపోతూ చంపేవరకు సాహసం చేస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలను లెక్కచేయడం లేదు. అనంతరం జైలు పాలవుతున్నారు. ఆవేశంలో చేసే తప్పులతో ఎంతోమంది కుటుంబాల్లో తీరని నష్టం చేకూరుస్తోంది. తర్వాత న్యాయస్థానాలు, జైలు జీవితం గడుపుతున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తుపైనా ప్రభావం పడుతోంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment