Telangana News: 'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!
Sakshi News home page

'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!

Published Mon, Sep 4 2023 12:26 AM | Last Updated on Mon, Sep 4 2023 2:10 PM

- - Sakshi

మంచిర్యాల: ఆధునిక కాలంలో కాలానుగుణంగా తమ భాష, సంస్కృతి ఎక్కడ కనుమరుగవుతుందేమోనన్న తపనతో ఆదివాసీ కొలాం తెగ యువత ముందడుగు వేసింది. కొలామి భాష, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో వికీపీడియాను వేదికగా ఎంచుకున్నారు.

భవిష్యత్‌ తరాలకు తమ భాష, సంస్కృతి, పదజాలం, జానపద పాటలు, నృత్య కళారూపాలు, చారిత్రాత్మక అస్తిత్వ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తూ తెలుగు లిపితో కొలాం భాషను వికీపీడియాలో పొందుపరుస్తూ.. పలువురు మన్ననలు పొందుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది వరకే ఉట్నూర్‌ కేబీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీవో పాల్గొని కొలామి భాషను వికీపీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయడంపై ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయి బోలిచేతో (భాష చైతన్యం) ఫౌండేషన్‌ నిర్వాహకులను అభినందించారు.

ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 46,677 మంది కొలాం జనాభా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన తెగ ఆదివాసీ కొలాం. వారి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కొలాం తెగకు చెందిన యువకులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి భాషను నేరుగా వికీపీడియాలోకి మార్చి తమ ఔనత్యాన్ని చాటుతున్నారు. కొలామి భాషతో పాటు మహానీయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల చరిత్రను కొలామిలో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు.

కొలాం సంస్కృతి..
గిరిజన తెగల్లో కొలాం సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కొలాం ఆదివాసీలు కొలిసే ఆరాధ్యదైవం భీమయ్యక్‌, నడిదమ్ము, ముత్తేలమ్మ, దండారీ, దూరడి, పొలకమ్మ దేవతులు ముఖ్యమైనవి. వివాహ వేడుకల్లో పాడే జానపదులు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం మహిళలు, పురుషులు ఉత్సవాల సందర్భంగా కొలామి మాతృభాషలో పాడే పాటలు, నృత్య కళారూపాలను కాలానుగుణంగా వివిధ ఉత్సవాలకు సంబంధించిన నృత్యాలు సేకరించి పొందుపర్చనున్నారు.

కొలామి వికీపీడియా ప్రస్థానం..
కొలామి వికీపీడియాను జూన్‌ 28న నేతి సాయి కిరణ్‌ ప్రారంభించారు. ప్రపంచంలో లిపి లేని ఆదివాసీ భాషలు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. భాష పదజాలం కోసం సంస్కృతి పరిరక్షణకు బోలిచేతో ఫౌండేషన్‌ స్థాపించారు సాయికిరణ్‌. భాష కోసం, ఆదివాసీలు సంస్కృతిక పంటలైన చిరుధాన్యాల బాహ్య ప్రపంచానికి తెలియచేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అంతరిస్తున్న భాషలపై పరిశోధన..
యునెస్కో ప్రకారం ప్రపంచంలో 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితాలోని చాలా భాషలు అంతరిస్తున్నాయి. వైవిధ్యంగా ఉన్న భాషలు ప్రపంచ భాష వైవిధ్యతను కోల్పోయే దిశలో ఉన్నాయి. భాషను డిజిటల్‌ మాద్యమాల ద్వారా పునరుద్ధరణ చేయడమే నా లక్ష్యం. నేతి సాయికిరణ్‌, తెలుగు వికీపీడియా, బోలిచేతో ఫౌండేషన్‌, వ్యవస్థాపకుడు, అస్సాం

భవిష్యత్‌కు కొలామి వికీపీడియా అవసరం..
తెలుగు వికీపీడియాలోని తెలంగాణలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేస్తున్నాం. సమకాలిన అంశాలపై రచనలు కొనసాగుతున్నాయి. వికీ బుక్స్‌లో నేను రచించిన కొలాం వీరుడు కుమురం సూరు, దండారీ కై తికాలు, దంతన్‌పల్లి భీమయ్యక్‌ మహాత్మ్యం, మోతీరాము శతకం పుస్తకాలు పొందుపర్చుతాను. – ఆత్రం మోతీరాం, కొలామి వికీపీడియా, కవి

మా జీవన విధానాన్ని వికీలో భద్రపరుస్తాం..
మా కొలాం సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు, దేవుళ్లు, జానపద నృత్యాలు, పాటలు, మా చరిత్రాత్మక స్థానాలు, మా జీవన విధానం, పల్లెలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వికీ కామన్స్‌లో భద్రపరుస్తాను.  ఆత్రం రాజ్‌కుమార్‌, కొలామి వికీపీడియా

ఇష్టంతో అనువాదం..
తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేయడం నాకెంతో ఇష్టం. జాతీయ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో తెలుగు లిపితో అనువాదం చేస్తున్నాం. మా మాతృభాష కొలామి భాషకు సేవా చేయడం నాకెంతో గర్వకారణం. – మడావి జంగు, కొలామి వికీపీడియా

వికీపీడియాలోకి..
తెలుగు లిపిని అలంబన చేస్తూ కొలామి భాషకు జీవం పోసి వందలాది వ్యాసాలతో ముందుకు సాగుతూ అంతర్జాతీయ వేదికగా నిర్మితమవుతున్న కొలామి వికీపీడియా అక్షర సేద్యంగా నిలువనుంది. కొలాం తెగ ప్రజలు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, మహారాష్ట్రలో యావత్మల్‌ జిల్లాలో నివసిస్తున్నారు. వీరిది ద్రావిడ భాష అయినా కొలామి భాషను మాట్లాడతారు. ప్రభుత్వ రికార్డుల్లో కొలామ్స్‌ అని నమోదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement