బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
● ఆస్పత్రిలో బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ● పోలీసుల జోక్యంతో విరమణ
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment