
గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు లక్సెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి భూమి విష్ణువర్ధన్ (22) రెండు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం బైక్ తీసుకుని ఇంటినుండి బయటికి వెళ్లాడు. రాత్రి సమయంలో బైక్ గూడెం గోదావరి వంతెనపై నిలిపి ఉంచినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఫోన్ చేయగా స్విచ్చాప్ వచ్చింది. మంగళవారం ఉదయం గోదావరి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం తేలి ఉంది. మృతుడు ఆరు నెలల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నాడు. మృతుని సోదరుడు మణిదీప్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.
గొడిసిర్యాలలో పురుగుల మందు తాగి మరొకరు ...
దస్తురాబాద్: పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం మండలంలోని గొడిసిర్యాలలో చోటు చేసుకుంది. ఎస్సై సీ.అశోక్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నేరెళ్ల అశోక్ (23) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం అతని చిన్నాన్న కుమారుడు పానుగంటి పవన్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి డిప్రెషన్‌కు లోనయ్యాడు. గొడిసిర్యాల ఎక్స్‌రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని తమ్ముడు పవన్ ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే అశోక్ పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు జన్నారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బాసర గోదావరిలో దూకి మహిళ ...
బాసర(నిర్మల్): బాసర గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన అనురాధ (35)కు అదే గ్రామానికి చెందిన సాయిలుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాయిలు నిత్యం మద్యం సేవించి ఇంటికివచ్చి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైంది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లింది. మంగళవారం తల్లి రాజవ్వకు ఫోన్‌చేసి విషయం తెలిపింది. అనంతరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మరణాయుధాలతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడకు చెందిన సలీం ఖాన్ సోషల్ మీడియాలో తల్వార్‌తో ఒక పోస్టును పెట్టడం జరిగిందన్నారు. సుమోటో కేసుగా నమోదు చేసి మంగళవారం సలీం ఖాన్‌పై ఆమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య